డీసీసీ అధ్యక్షుడిగా శివసేనారెడ్డి నియామకం
వనపర్తి: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా శాట్ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డిని నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాజకీయ నేపథ్యం లేని సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన శివసేనారెడ్డి.. విశాఖపట్టణంలో ఎరోనాటికల్ ఇంజినీరింగ్ చదివారు. కాలేజీ రోజుల్లోనే నాయకత్వ లక్షణాలు అలవడి కళాశాల ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఓటమి ఎరగకుండా ఇప్పటి వరకు ప్రయత్నం చేసిన ప్రతిచోట విజయం సాధించారు. ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌లోనూ కీలకంగా, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన గుర్తింపు ఉంది. యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి రాహుల్‌గాంధీలాంటి జాతీయస్థాయి నేతల గుర్తింపు పొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అతడిని శాట్ చైర్మన్‌గా నియమిస్తూ ఎవరికీ ఇవ్వనంత స్వేచ్ఛ, ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర పార్టీ పరిశీలకులు పార్టీ బలోపేతానికి సుదీర్ఘంగా పనిచేసిన శివసేనారెడ్డికి కాంగ్రెస్‌పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించినట్లు పార్టీవర్గాలు చర్చించుకుంటున్నాయి. తన మార్క్ జిల్లాలో కనిపించేలా స్పోర్ట్స్ స్కూల్, స్విమ్మింగ్‌పూల్, క్రికెట్ మైదానం ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నారు.


