ఊగిసలాడుతోంది..! | - | Sakshi
Sakshi News home page

ఊగిసలాడుతోంది..!

Nov 22 2025 8:32 AM | Updated on Nov 22 2025 8:32 AM

ఊగిసలాడుతోంది..!

ఊగిసలాడుతోంది..!

మూడో ప్యాకేజీలో..

అచ్చంపేట: తెలంగాణ– ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను అనుసంధానించే ఐకానిక్‌ కేబుల్‌ వంతెన కల ఇప్పట్లో నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. కృష్ణానదిపై నిర్మించనున్న 1.07 కి.మీ., మేర వంతెన నిర్మాణ టెండర్‌ ప్రక్రియను మరోసారి పొడిగించారు. ఈ నెల 27 వరకు బిడ్‌ వేసేందుకు అవకాశం కల్పించగా.. 28న ఓపెన్‌ చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో పనులు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుకు వచ్చిన టెండర్‌ దాఖలులో తగినంత అర్హత లేనందున గతంలో చాలాసార్లు తిరస్కరణకు గురయ్యాయి. వంతెన నిర్మాణం కోసం 2023 అక్టోబరు 7న టెండర్లు ఆహ్వానించగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు 34 సార్లు పొడిగిస్తూ వస్తున్నారు. 2024 ఫ్రిబవరిలో నిధుల సర్దుబాటు కారణంగా నిలిపివేశారు. గతంలో పిలిచిన టెండర్ల కొనసాగిస్తూ.. ఈ ఏడాది మార్చి 17వరకు జాతీయ రహదారుల విభాగం కొత్త తేదీని ప్రకటించింది. వివిధ కారణాలతో అప్పటి నుంచి పొడిగిస్తూ వస్తున్నారు. ఈ నెల 7న టెండర్‌ ఓపెన్‌ చేయాల్సి ఉండగా.. 27 వరకు బిడ్‌ దాఖలుకు అవకాశం కల్పించారు. మొత్తంగా వంతెన నిర్మాణం కోసం పిలిచిన టెండర్‌ ప్రక్రియ వాయిదాలు పడుతూ వస్తుండగా.. ఈసారైనా మోక్షం లభిస్తుందా.. లేదా అనేది వేచి చూడాల్సిందే.

మూడేళ్లుగా ఎదురుచూపు..

సోమశిల (మల్లేశ్వరం)– సిద్దేశ్వరం వద్ద కృష్ణానదిపై ప్రతిపాదిత 800 మీటర్ల రెండు వరుసల కేబుల్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. మూడేళ్లగా పెండింగ్‌లో ఉన్న టెండర్లను తెరిచి నిర్మాణ సంస్థను గుర్తించి పనులు చేపట్టాల్సి ఉండగా దాదాపు రూ.వెయ్యి కోట్లకుపైగా వ్యయం చేయాల్సి రావడంతో నీతి ఆయోగ్‌ అప్పట్లో అభ్యంతరం తెలిపింది. దీంతో కొంత జాప్యం జరగడంతో పాటు అంచనా వ్యయం కూడా పెరిగింది. ఫలితంగా భారత్‌మాల ప్రయోజన జాబితాలో ఉండి అనుమతి లభించని ప్రాజెక్టులను కేంద్రం రద్దు చేసింది. ఈ ప్రాజెక్టు కూడా అందులోనే ఉండటంతో ఆలస్యమైంది. దీనిని ఇప్పుడు నేషనల్‌ హైవేస్‌ ఒరిజినల్‌ (ఎన్‌హెచ్‌– ఓ) జాబితాలోకి మార్చడంతో వంతెన మళ్లీ తెరపైకి వచ్చింది. తీగల వంతెన నిర్మాణానికి రూ.1,082.56 కోట్లు మంజూరు కాగా.. 2023 అక్టోబరు 7న జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని స్టాండింగ్‌ పైనాన్స్‌ కమిటీ(ఎస్‌ఎఫ్‌సీ) ఆమోదం తెలిపింది. అదే నెలలో మల్లేశ్వరం– సిద్దేశ్వరం కేబుల్‌ వంతెన నమూనాను నేషనల్‌ హైవే అథారిటీ రూపొందించి టెండర్లకు ఆహ్వానించింది. జాతీయ, అంతర్జాతీయంగా అనుభవనం ఉన్న సంస్థల నుంచి బ్రిడ్స్‌ రాకపోవడంతో టెండర్‌ గడువు పొడిగిస్తూ వస్తున్నారు. అప్రోచ్‌ రోడ్డు, వంతెన నిర్మించే ప్రాంతం అటవీశాఖ పరిధిలో ఉండటంతో అటవీశాఖ నుంచి క్లియరెన్స్‌ రాకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో రహదారి, బ్రిడ్జి కోసం సేకరించే అటవీ భూమిని ఆ శాఖ అధికారులు పరిశీలించారు. రహదారి నిర్మాణం కోసం అటవీ భూమి సేకరించే ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. భూమికి భూమి ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధం కావడంతో దాదాపు క్లియర్స్‌ వచ్చినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఇదే జరిగితే జనవరిలో పనులు మొదలయ్యే అవకాశం ఉంది.

భూ సేకరణ పూర్తయితే..

కొల్లాపూర్‌– సోమశిల రహదారి వరిదేల శివారు నుంచి రహదారి పనులు మొదలు కావాల్సి ఉంది. మూడో ప్యాకేజీలో ఐకానిక్‌ వంతెన ఇవతల 8 కి.మీ., ఏపీ పరిధిలో సిద్దేశ్వరం గుట్టల మధ్య 5.4 కి.మీ., అప్రోచ్‌ రహదారి నిర్మించాలి. వంతెన నిర్మించే ప్రాంతం వరకు భూ సేకరణ చేయాల్సి ఉంది. ఇందులో అటవీ శాఖకు చెందిన భూమితోపాటు రెవెన్యూ, రైతుల పట్టా భూమలు ఉన్నాయి. ఇప్పటి అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. భూ సేకరణ ప్రక్రియ ఓ కొలిక్కి వస్తే టెండర్‌ ఓపెన్‌ అయ్యే అవకాశం ఉంది. – రాజేందర్‌, ఈఈ జాతీయ రహదారుల శాఖ

తెలంగాణలో మొదటి, ఏపీలో రెండో ప్యాకేజీల పనులు దాదాపుగా పూర్తి కావొస్తుండటంతో మూడో ప్యాకేజీ పనులు చేపట్టేందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. మొదటి ప్యాకేజీలో కల్వకుర్తి (కొట్ర) 0 కి.మీ. నుంచి కొల్లాపూర్‌ 79.3 కి.మీ. వరకు పనులు జరుగుతున్నాయి. రెండో ప్యాకేజీలో ఏపీలో రహదారి నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. మూడో ప్యాకేజీలో వరిదేల శివారు నుంచి ఐకానిక్‌ బ్రిడ్జి వరకు సుమారు 8 కి.మీ., మేర 2, 4 వరుసల అప్రోచ్‌ రహదారి పనులు సోమశిల, చెన్నంపల్లి, పెంట్లవెల్లి, మల్లేశ్వరం శివారులో చేపట్టాల్సి ఉంది. మల్లేశ్వరం– సిద్దేశ్వరం మధ్య 87.3 కి.మీ., నుంచి 88.4 కి.మీ., వరకు ఐకానిక్‌ వంతెన నిర్మించనున్నారు. ఏపీ పరిధిలో ఐకానిక్‌ బ్రిడ్జి నుంచి సిద్దేశ్వరం, కపిలేశ్వరం వరకు 5.5 కి.మీ., అప్రోచ్‌ రహదారి నిర్మిస్తారు. ఇందుకోసం అధికారులు రూ.340 కోట్లకు టెండర్‌ ఆహ్వానించింది. వంతెన అప్రోచ్‌ రహదారి కోసం తెలంగాణ పరిధిలో 25 హెక్టార్ల అటవీ భూమి, 28 హెక్టార్ల రెవెన్యూతోపాటు రైతుల పట్టా భూములు సేకరించాల్సి ఉంది. ఏపీ పరిధిలోని సిద్దేశ్వరం, కపిలేశ్వరం, నందికొట్కూర్‌ అటవీ ప్రాంతంలో 25 హెక్టార్ల భూమి సేకరించనున్నారు. మూడో ప్యాకేజీలో వంతెనతో పాటు అప్రోచ్‌ రహదారి ఉంది. భూ సేకరణ పూర్తయితేనే వంతెన, అప్రోచ్‌ రోడ్డు పనులు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

మల్లేశ్వరం– సిద్దేశ్వరంవంతెనకు లభించని మోక్షం

ఏళ్లుగా వాయిదా పడుతున్న టెండర్‌ ప్రక్రియ

సరైన అర్హత లేనందునే చాలాసార్లు తిరస్కరణ

తాజాగా ఈ నెల 27 వరకు గడువు పొడిగింపు.. 28న ఓపెన్‌

మూడో ప్యాకేజీ పనుల ప్రారంభానికి అడ్డంకిగా మారిన భూ సేకరణ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement