మహిళలను కోటీశ్వరుల్ని చేస్తాం
కొత్తకోట రూరల్: మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దమందడిలో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఎమ్మెల్యే చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొదటగా తన సొంత మండలంలో ప్రారంభ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని గ్రామీణ మహిళా సంఘాల సభ్యులకు 89 వేల పైచిలుకు చీరలు వచ్చాయని.. పురపాలికలకు మరో 40 వేల చీరలు వస్తాయన్నారు. మహిళా సంఘంలో ప్రతిసభ్యురాలికి ఉచితంగా చీర ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని.. ప్రభుత్వం కొలువుదీరిన డిసెంబర్ 9న మొదటి సంతకం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఫైల్‌పై చేసినట్లు గుర్తు చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు పెట్రోల్ బంకులు, బస్సులు, వడ్డీ లేని రుణాలు, మహిళాశక్తి క్యాంటీన్లు తదితర పథకాలు అందిస్తున్నామన్నారు. జిల్లాకేంద్రంలో రూ.5 కోట్లతో జిల్లా మహిళా సమాఖ్య భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళకు ఉచితంగా చీర ఇవ్వడం సంతోషకమన్నారు. మహిళా సంఘం సభ్యులు బ్యాంకు రుణాలు బాధ్యతతో తిరిగి చెల్లిస్తారని, అందుకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంఘం ద్వారా బ్యాంకు రుణం ఇప్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 105 మందికి రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు. పెబ్బేరులో పెట్రోల్ బంక్, మహిళా సమాఖ్య భవనం త్వరలో పూర్తి కానున్నట్లు తెలిపారు.
ప్రారంభోత్సవం.. భూమిపూజ...
జగత్‌పల్లిలో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి మంజూరు చేసిన రాజనగరం దేవాలయం నుంచి పెద్దమందడి వరకు రెండు వరసల రహదారి పనులకు భూమిపూజ చేశారు. పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌శాఖ ఇంజినీర్లను కోరారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్‌గౌడ్, అడిషనల్ డీఆర్డీఓ సరోజ, తహసీల్దార్ పాండు, ఎంపీడీఓ పరిణత, జిల్లా మహిళా సమాఖ్య చైర్మన్ స్వరూప, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్‌పార్టీ నాయకులు గట్టన్న, వెంకటస్వామి, ఐ.సత్యారెడ్డి, రఘుప్రసాద్, ఏపీఎం సక్రూనాయక్ పాల్గొన్నారు.


