కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం
గోపాల్‌పేట: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఎంతో అభివృద్ధి సాధించిందని.. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చాక దివాళా తీయించారని, అభివృద్ధిని ఆమడ దూరంలో ఉంచడమే కాకుండా కుంటిసాకులు చెప్పడం హాస్యాస్పదమని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం రేవల్లి మండలం నాగపూర్ సమీపంలో స్థానిక ఎన్నికల సన్నద్ధతపై నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో రైతులకు రైతుబంధు, రైతుబీమా, సమృద్ధిగా సాగు, తాగునీరు అందించడమేగాక ఉచిత విద్యుత్, వెయ్యి గురుకులాలు తదితర ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు, 420 హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రజాపాలనలో రైతులు, ఉద్యోగులు, నిరుపేదలు ఇలా అన్నివర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని... రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. నాయకులు నాగం తిరుపతిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు భీమయ్య, మాజీ ఎంపీపీ సేనాపతి, మాజీ వైఎస్ ఎంపీపీ మధుసూదన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


