అసలు విషయం ఇదేనా..?
● సా మిల్లు యజమాని, వ్యాపారి మధ్య విభేదాలతో బయటకు..
● విచారణలో ఉన్నతాధికారులు
● ఆసక్తికర విషయాలు వెలుగులోకి..
అటవీ అధికారులు పట్టుకున్న లారీ ఇదే..
తుమ్మ, వేప కలప రవాణా చేసేందుకు మహారాష్ట్ర ప్రాంతంలో ఎలాంటి అనుమతి అవసరం లేదు. కానీ తెలంగాణలో ఈ రకం చెట్లు కొట్టేందుకుగాని, రవాణా చేసేందుకుగాని తప్పనిసరిగా అటవీ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మహారాష్ట్రకు చెందిన కలప లారీ ఎలాంటి అనుమతి లేకుండా సరిహద్దు చెక్‌పోస్టు దాటి వనపర్తి వరకు ఎలా వచ్చిందనే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పడం లేదు. కలప అక్రమ రవాణా చేస్తే.. వే బ్రిడ్జిలో తూకం వేసి టన్నుల లెక్కన మార్కెట్ విలువకు నాలుగైదు రెట్లు అధికంగా జరిమానా విధించాల్సి ఉంటుంది. ఈ నెల 14న పట్టుబడిన కలప లారీకి రూ.25 వేల జరిమానా విధించినట్లు ఫారెస్ట్ రేంజర్ చెప్పుకొచ్చారు. నిజానికి ఇప్పటి వరకు విచారణ నివేదిక డీఎఫ్‌ఓకు అందజేయలేదు. ఈ విషయాన్ని జిల్లా ఫారెస్ట్ కార్యాలయ అధికారి ధ్రువీకరించారు.
వనపర్తి: కొంతకాలంగా గుట్టుగా సాగుతున్న కలప అక్రమ రవాణా వ్యవహారం స్థానిక సా మిల్లు యజమాని.. మహారాష్ట్ర కలప వ్యాపారి మధ్య తలెత్తిన విభేదాలతో వెలుగులోకి వచ్చింది. అధికారుల ఉదాసీనత, మామూళ్ల బాగోతం కూడా ఈ ఘటనతో బయటపడిందన్న చర్చ స్థానికంగా కొనసాగుతోంది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలో రవాణాకు ఎలాంటి ఆక్షేపణలు లేని తుమ్మ, వేప కలపను అక్రమంగా వనపర్తి మండలం చిట్యాల శివారులోని ఓ సా మిల్లు వ్యాపారి కొంతకాలంగా దిగుమతి చేసుకుంటూ.. అక్రమ దందాకు తెర తీశారు. ఈ విషయం సంబంధిత బీట్ అధికారులు, మరికొందరు అటవీ అధికారులకు తెలిసినా.. లోపాయకారి ఒప్పందాలతో ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. ఈ నెల 14న శుక్రవారం అటవీ అధికారులు చిట్యాల క్రాస్‌రోడ్డు నుంచి హైదరాబాద్‌కు కలప తరలిస్తున్న లారీని పట్టుకొని జిల్లాకేంద్రంలోని కార్యాలయానికి తరలించారు. ఫారెస్ట్ రేంజర్ ఐదురోజుల పాటు సమగ్ర విచారణ చేసి చర్యలకుగాని, జరిమానా విధించేందుకుగాని ఉన్నఽతాధికారులకు సిఫారస్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కొంతకాలంగా గుట్టుగా సాగిన కలప అక్రమ దందాలో ధర విషయమై సా మిల్లు యజమాని, మహారాష్ట్ర కలప వ్యాపారి మధ్య విభేదాలు తలెత్తాయని.. దీంతో సదరు మిల్లు యజమాని తనతో సన్నిహితంగా ఉండే ఫారెస్ట్ బీట్ అధికారితో మహారాష్ట్ర వ్యాపారిని బెదిరించేందుకు లారీని పట్టుకోవాలని ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. అనుకున్నట్లుగానే.. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన కలప లారీని జిల్లా అటవీశాఖ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో మొదట్లో నామమాత్రపు జరిమానా విధించి వదిలేసే ప్రయత్నం చేశారు. కానీ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో కథ అడ్డం తిరిగినట్లయింది. తలుపులు, కిటికీలు, దర్వాజాల తయారీకి వినియోగించే కలపను అతి తక్కువ ఖరీదు ఉన్నట్లుగా చూపించి తక్కువ జరిమానా విధించేందుకు విఫల యత్నం చేశారు. కాగా.. ఈ విషయంపై సమగ్ర విచారణ నివేదిక ఇవ్వాలని డీఎఫ్‌ఓ ఆదేశించడంతో ఫారెస్ట్ రేంజర్ అధికారులు ఈ విషయాన్ని గుట్టుగా ఎలా ముగించాలనే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.


