వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేసి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా తయారీపై గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి పాల్గొన్నారు. విడతల వారీగా ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఎన్ని ఫేస్‌లు, ఏ ఫేజ్‌లో ఏయే మండలాల్లో ఎన్నికలు జరగాలో జిల్లా వారీగా ప్రణాళిక అందించాలన్నారు. సెప్టెంబర్ 2న విడుదల చేసిన పంచాయతీ తుది ఓటరు జాబితా సంబంధించి ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించి నవంబర్ 22లోపు పరిష్కరించాలని సూచించారు. నవంబర్ 23న ప్రతి గ్రామపంచాయతీకి సంబంధించి పోలింగ్ కేంద్రాలు, ఫొటోలతో కూడిన ఓటరు జాబితా ప్రచురణ పూర్తి కావాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎంసీసీ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు. ఎంసీసీ ఉల్లంఘనలపై వచ్చే ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి యంత్రాంగం సిద్ధం చేసుకోవాలన్నారు. ఏఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీపీఓ తరుణ్ చక్రవర్తి, డీఎల్‌పీఓ రఘునాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
‘ఒకేషనల్ విద్యార్థులకు ఓజేటీ తరగతులు’
వనపర్తిటౌన్: జిల్లాలోని ఇంటర్మీడియట్ ఒకేషనల్ విద్యార్థులకు ఆన్‌జాబ్ ట్రైనింగ్ (ఓజేటీ) తరగతులు నిర్వహిస్తున్నట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని సృష్టి, రక్ష ఆస్పత్రిలో కొనసాగుతున్న ఓజేటీ తరగతులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తరగతులు డిసెంబర్ 31 వరకు కొనసాగుతాయని, ఓజేటీ పరీక్షకు 100 మార్కులు ఉంటాయని, వివిధ అంశాల వారీగా మార్కులు కేటాయిస్తామన్నారు. ఓజేటీతో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందుతాయని చెప్పారు. విద్యార్థుల నైపుణ్యాల ఆధారంగా మార్కులు వస్తాయని, ప్రతి విద్యార్థి తప్పనిసరిగా హాజరై ఉత్తీర్ణులు కావాలని కోరారు. డేగ నాగిరెడ్డి వృత్తి విద్య కళాశాల విద్యార్థులు సృష్టి ఆస్పత్రిలో, సూర్య వృత్తి విద్య కళాశాల విద్యార్థులు రక్ష ఆస్పత్రిలో ఓజేటీ తరగతులకు హాజరయ్యారు.
బాలల చట్టాలపై అవగాహన ఉండాలి
వీపనగండ్ల: ప్రతి విద్యార్థి తమ హక్కులు.. రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి రజని కోరారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కేజీబీవీ (బాలికలు) పాఠశాల, కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, పోక్సో, మోటార్ వాహనాల చట్టం గురించి విద్యార్థులకు వివరించారు. బాలల రక్షణకు రాజ్యాంగంంలో అనేక చట్టాలు రూపొందించబడ్డాయని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు అన్నిరంగాల్లో రాణిస్తూ చదువుతున్న విద్యాసంస్థలకు గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలని, పక్క వ్యక్తుల నుంచి అపాయం జరుగు తుందని భావిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శివగౌడ్, జీహెచ్‌ఎం భానుప్రకాష్, కేజీబీవీ ప్రత్యేక అధికారి, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


