మండల కేంద్రం సమీపంలో ఉల్లి పంటను గొర్రెలు మేపునకు వదిలేసిన రైతు రత్నయ్య
చిన్నంబావి మండలంలో ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. సరైన ధర లేక పెట్టుబడి సైతం చేతికందకపోవడంతో పాటు నష్టాలు చవిచూడాల్సి రావడంతో పంటను అలాగే వదిలేస్తున్నారు. ప్రస్తుతం నాణ్యమైన ఉల్లి క్వింటా రూ.800 నుంచి రూ.1000 ధర పలుకుతోంది. పంట కోతకు కూలీలు క్వింటాకు రూ.200 చొప్పున తీసుకుంటుండటంతో ఎకరాకు రూ.8 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది.
దీనికితోడు పంటను హైదరాబాద్ మార్కెట్‌కు తరలించడానికి కూడా రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. పంట విక్రయిస్తే పెట్టుబడి, కూలీలు, రవాణా ఖర్చులు కూడా చేతికందే పరిస్థితి లేకపోవడంతో చాలామంది రైతులు పంటను అలాగే వదిలేస్తున్నారు. పలువురు రైతులు గొర్రెలు, పశువులుమేపుతుండగా.. మరికొందరు పంటను వదిలేయడంతో పరిసర గ్రామాల ప్రజలు వచ్చి వారే కోసుకొని తీసుకెళ్తున్నారు. ఇంత భారీ నష్టం చవిచూస్తామని ఏనాడు అనుకోలేదని పలువురు రైతులు కన్నీంటి పర్యంతమవుతున్నారు.
– చిన్నంబావి
మియాపూర్‌లో రైతు జిన్ను మల్లయ్య పంట వదిలేయడంతో తీసుకెళ్తున్న పరిసర గ్రామాల ప్రజలు


