పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు
వనపర్తి: పెండింగ్ కేసుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి డీజీపీ శివధర్‌రెడ్డి వివిధ ప్రాంతాల పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి ఎస్పీ పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలో నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, పెండింగ్ కేసుల వివరాలను ఎస్పీ వివరించారు. కేసుల పరిష్కారానికి అధికారులు చూపిస్తున్న చొరవ, నేరస్తులకు కోర్టులో శిక్షలు పడేలా తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు. సమావేశంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, జిల్లా పోలీసు కార్యాలయ ఏఓ సునందన, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సీఐలు కృష్ణయ్య, రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, డీసీఆర్బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి, డీసీఆర్బీ కానిస్టేబుల్ ఈశ్వర్, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


