స్వచ్ఛ పాఠశాలలుగా తీర్చిదిద్దాలి
వనపర్తిటౌన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను స్వచ్ఛంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పరిశీలకుడు మిరాజ్ ఉల్లాఖాన్ కోరారు. 5.0 స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల, ఉర్దూ మాద్యమ ఉన్నత పాఠశాల, రాజాపేటలోని ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలల పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. వృథా సామగ్రిని ఎక్కడపడితే అక్కడ పారవేయొద్దని సూచించారు. మధ్యాహ్న భోజన సమయంలో శుభ్రత లోపించకుండా చూడాలని, ఇందుకు పాఠశాలలోని అందరూ బాధ్యత తీసుకోవాలన్నారు. స్పెషల్ క్యాంపెయిన్‌లో భాగంగా పాఠశాలలను తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర విద్యాశాఖ తరఫున రాష్ట్ర పరిశీలకులుగా వచ్చి జిల్లాలోని పాఠశాలల పనితీరును బేరీజు వేస్తున్నామని చెప్పారు. ఆయన వెంట జిల్లా సీఎంఓ ప్రతాప్‌రెడ్డి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.


