బకాయిలు చెల్లించాలంటూ ఆందోళన
వనపర్తిటౌన్: ఫీజు రియింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ గురువారం జిల్లాకేంద్రంలోని బస్టాండ్ సమీపంలో విద్యార్థి సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. ఈ సందర్భంగా వివిధ విద్యార్థి సంఘాల నాయకులు గోపాలకృష్ణ, ఆది, రమేష్, గణేష్, వీరయ్య, యశ్వంత్ మాట్లాడుతూ.. పాలకులకు ఓట్లు, సీట్ల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల భవిష్యత్‌పై లేదని మండిపడ్డారు. ఏళ్లుగా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు బంద్‌కు పిలుపునిచ్చాయని, దీంతో పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్... రెండేళ్లవుతున్నా విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.8,300 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని.. లేనిపక్షంలో విద్యార్థులందరినీ ఏకం చేసి పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
● విద్యార్థుల రాస్తారోకోతో హైదరాబాద్, మహబూబ్‌నగర్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ తదితర ప్రాంతాల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యార్థి సంఘాల ఆందోళనతో పోలీసులు వాహనాల రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్, ిపీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, బీఆర్‌ఎస్ నాయకులు వంశీ, దినేష్, సూర్యవంశం గిరి, అరవింద్, బన్ని, వీరన్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


