క్రీడారంగానికి అధిక ప్రాధాన్యం
● రాష్ట్ర ప్రణాళికా సంఘం
ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి
● ప్రారంభమైన
జోనల్‌స్థాయి క్రీడాపోటీలు
గోపాల్‌పేట: క్రీడలతో మానసికోల్లాసం పెంపొందడమేగాక ఏకాగ్రత పెరుగుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బుద్దారం గురుకుల పాఠశాలలో 11వ జోనల్‌స్థాయి క్రీడా పోటీలను కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి జాతీయ పతాక ఆవిష్కరణ, క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనపర్తి వనాలపర్తి కాదని, క్రీడాపర్తిగా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ప్రస్తుత ఆధునిక కాలంలో బాలికలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని.. చదువుతో పాటు క్రీడల్లోనూ అత్యంత ప్రతిభ కనబర్చి ఉన్నతస్థాయికి చేరుకోవాలని సూచించారు. ఇటీవల మహిళా క్రికెటర్లు వరల్డ్‌కప్ సాధించారని గుర్తుచేసి.. అంతటి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా క్రీడలపై ఆసక్తి ఉన్నవారని, ఆయనకు ఫుట్‌బాల్‌పై పట్టుందని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. క్రీడాకారులు ఓటమిని పాఠంగా తీసుకొని మళ్లీ సాధన చేసి విజయాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం వెల్దండ – తెల్కపల్లి జట్ల కబడ్డీ పోటీని ప్రారంభించారు. పోటీల్లో వనపర్తి జిల్లా నుంచి గోపాల్‌పేట, పెద్దమందడి, కొత్తకోట.. నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి కొల్లాపూర్, తెల్కపల్లి, వెల్దండ, మన్ననూరు పాఠశాలల క్రీడాకారులు 680 మంది పాల్గొన్నారు. అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్యారమ్స్, చెస్, టెన్నికాయిట్, అథ్లెటిక్స్ తదితర పది విభాగాల్లో క్రీడా పోటీలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆయా క్రీడల్లో ప్రతిభ కనబర్చిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, అచ్చుతరామారావు తదితరులు పాల్గొన్నారు.


