రోడ్డెక్కిన వేరుశనగ రైతులు
● రాయితీ విత్తనాలు పంపిణీ
చేయాలంటూ రాస్తారోకో
పాన్‌గల్: రాయితీ వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలంటూ గురువారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వీరికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సుబ్బయ్యయాదవ్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యానాయక్ మద్దతు తెలిపి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వంద శాతం రాయితీపై అందిస్తున్న వేరుశనగ విత్తనాలు శాగాపూర్‌తో పాటు మండలంలోని చాలా గ్రామాల రైతులకు అందలేదన్నారు. వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. అధికారులు కొందరు నాయకులకే పెద్ద మొత్తంలో అందించి అర్హులైన చాలా మంది రైతులను విస్మరించారని ఆరోపించారు. వేరుశనగ సాగు చేసే రైతులకే విత్తనాలు పంపిణీ చేస్తున్నామని చెబుతున్నా.. వరి సాగు చేసిన వారికి, అనర్హులకు పంపిణీ చేసి అర్హులకు ఇవ్వలేదన్నారు. విత్తనాల పంపిణీపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రాస్తారోకో విరమించేది లేదని బైఠాయించడంతో వనపర్తి–కొల్లాపూర్ రహదారికి ఇరువైపులా బస్సులు, ఇతర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో పాటు మద్దతు తెలిపిన నాయకులను ఆందోళన విరమించాలని నచ్చజెప్పినా వినలేదు. దీంతో పోలీసులు ఏఓ మణిచందర్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకొని మాట్లాడారు. ఇప్పటి వరకు మండలానికి వచ్చిన వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశామని.. ఇంకా విత్తనాలు అందని రైతుల విషయాన్ని జిల్లా అధికారులకు నివేదిస్తామని, మంజూరైతే పంపిణీ చేస్తామని చెప్పడంతో రాస్తారోకో విరమించారు.
● మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయం సమీపంలో ఉన్న గోదాంలో నిల్వచేసిన రాయితీ వేరుశనగ విత్తన బస్తాలను కొందరు రాత్రిళ్లు వాహనాల్లో తరలించారని, వాటికి సంబంధించిన వీడియోలు ఉన్నాయని.. సమగ్ర విచారణ జరపాలని రైతులు, మద్దతు తెలిపిన నాయకులు ఏఓకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఏఓ మాట్లాడుతూ.. గోదాంలో రాయితీ విత్తనాలతో పాటు ఇక్రిశాట్ నుంచి వచ్చిన 50 శాతం రాయితీ విత్తన బస్తాలు కూడా ఉన్నాయన్నారు. ఇక్రిశాట్ నుంచి వచ్చిన విత్తన బస్తాలనే తరలించారన్నారు.


