గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి
వనపర్తి: గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని.. సమాచార హక్కు చట్టం, గ్రామసభల నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కోరారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ నుంచి వచ్చిన మాస్టర్ ట్రైనర్ పి.కృష్ణ గ్రామస్థాయి లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులకు ఒకరోజు శిక్షణ నిర్వహించగా.. డీపీఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి నెల గ్రామసభలు నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు, ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించడమే కాకుండా ఏవైనా సమస్యలుంటే పరిష్కరించాలని సూచించారు. సమాచార హక్కు చట్టం, గ్రామసభల నిర్వహణపై శిక్షణ ఇస్తున్నామని.. చట్టాలపై అవగాహన కలిగి ఉండి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. లైన్ డిపార్ట్‌మెంట్లు అయిన పంచాయతీరాజ్, సంక్షేమ, నీటిపారుదల, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యశాఖల నుంచి 35 మంది గ్రామస్థాయి సిబ్బంది శిక్షణలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సహాయ కార్యనిర్వహణ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


