చెరువుకు చేరినా..
లక్ష్యం.. ‘నీళ్ల’పాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మత్స్యకారుల ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో చేపపిల్లలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి సుమారు మూడు నెలల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా.. వివిధ రకాల కారణాలతో జాప్యం చోటుచేసుకుంది. ఎట్టకేలకు గత నెల 17న పంపిణీకి శ్రీకారం చుట్టినప్పటికీ.. నిర్దేశిత లక్ష్యం చేరుకోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు అదునుదాటిన తర్వాత చేప విత్తనాలు సరఫరా చేయడం.. నిర్దేశిత లక్ష్యంలో కోత పెట్టి తూతూమంత్రంగా ముగించడం ప్రతిఏటా ఆనవాయితీగా వస్తోంది. ఇది చాలదన్నట్లు కాంట్రాక్టర్లు మేలు రకాలకు తిలోదకాలు ఇస్తుండడంతో సర్కారు లక్ష్యం నెరవేరడం లేదు.
రెండేళ్లుగా ఆలస్యంగానే..
రాష్ట్రంలో మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి వందశాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎదిగిన చేపల విక్రయం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించగా.. మత్స్యకారుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా ఏర్పడింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. ఈ పథకాన్ని కొనసాగించింది. గతేడాది ఉమ్మడి జిల్లాలో బొచ్చ, బంగారు తీగ, రౌట, మోస్ వంటి రకాల చేప పిల్లలను వదిలారు. ఈసారి కూడా ప్రభుత్వం చేప విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే ఎప్పుడూ ఏప్రిల్‌లో టెండర్లు ప్రారంభించి వర్షాకాలంలోగా చేపల పంపిణీని పూర్తిచేసేవారు. కానీ, రెండేళ్లుగా పలు కారణాలతో ఈ ప్రక్రియలో ఆలస్యం జరుగుతూ.. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు పంపిణీ చేస్తున్నారు.
ఈసారి అదే తీరు..
ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలోని 4,225 నీటి వనరుల్లో రూ.11.80 కోట్ల వ్యయంతో 10.63 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు 863 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లోని సభ్యులు, లైసెన్స్‌దారులు మొత్తం 66,808 మందితోపాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా మరికొన్ని వేలాది మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. కానీ, ఇప్పటి వరకు పదిశాతం కూడా లక్ష్యాన్ని చేరలేదు. మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాలో చేపపిల్లల పంపిణీ ప్రారంభం కాగా.. వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఇంకా మొదలుపెట్టలేదు. ఇక్కడ మంత్రి చేతులమీదుగా ప్రారంభించాలని వేచిచూస్తుండడంతోనే ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా పూర్తిచేస్తామని ‘అధికార’ యంత్రాంగం చెబుతున్నా.. గతేడాదిలాగే కోత తప్పదని మత్స్యకార సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
గతేడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 8.81 కోట్ల చేప పిల్లలను చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో వదలాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఒక్క జోగుళాంబ గద్వాల జిల్లాలోనే పూర్తిస్థాయిలో లక్ష్యం చేరుకోగా.. మిగతా నాలుగు జిల్లాల్లో సగం కూడా చేరుకోలేకపోయారు. మొత్తంగా 4,56,68, 000 చేపపిల్లలను మాత్రమే నీటిలో వదలగా.. అది కూడా అదును దాటిన తర్వాత అక్టోబర్ చివరలో మొదలుపెట్టి నవంబర్ చివరలో పూర్తి చేశారు. పలు జిల్లాల్లో అదును దాటిన నేపథ్యంలో 35–40 ఎంఎం సైజు చేపలు వేయలేదు. 80–100 ఎంఎం సైజు గల చేప పిల్లలనే వదిలినా సరిగా ఎదగలేదని మత్స్యకారులు పేర్కొంటున్నారు. ఇందుకు అదును దాటిన తర్వాత చేప పిల్లలు వదలడమే కారణమని చెబుతున్నారు.
చివరికి నిర్దేశిత
లక్ష్యంలోనూ సగం మేర కుదింపు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా
ఏటా ఇదే తంతు
కాంట్రాక్టర్ల చేతిలోనే
మత్స్యకారుల భవిష్యత్
‘అధికార’ యంత్రాంగం
ప్రత్యేక దృష్టి సారిస్తేనే ఫలితం
చెరువుకు చేరినా..


