విస్తరణ.. సాగేనా?
హామీల అమలుపై స్పష్టత కరువు..
ఎన్నికల కోడ్‌తో జాప్యం..
జిల్లాకేంద్రంలో నత్తనడకన కర్నూలు రహదారి పనులు
● రెండేళ్లుగా కొనసాగుతున్న వైనం
● హడావుడి తప్ప..
ముందుకుపడని అడుగులు
● టీడీఆర్ ఊసే మరిచిన అధికారులు
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలో రహదారి విస్తరణపై స్పష్టత కొరవడింది. రెండేళ్లుగా విస్తరణ కొనసాగుతోందని చెప్పడం తప్పా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో రహదారి విస్తరణలో ఇళ్లు, వ్యాపార సముదాయాలు కోల్పోయే బాధితులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని.. పనులు మాత్రమే మిగిలాయని ప్రజాప్రతినిధుల నుంచి అధికారుల వరకు హడావుడి చేశారు. కర్నూలు రహదారి వైపు వివేకానంద మార్గ్ నుంచి రామాలయం వరకు సుమారు 165 నివాసాలు ఉండగా.. వాటిలో కొన్ని పాక్షికంగా, మరికొన్ని పూర్తిగా నేలమట్టమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఓ వ్యాపారవేత్త ఎమ్మెల్యే సూచన మేరకు బస్టాండ్ మార్గంలోని తన వ్యాపార సముదాయాన్ని నేలమట్టం చేశారు. ఈ క్రమంలోనే విస్తరణ పనులు ఉపందుకున్నాయని అందరూ భావించినా.. ప్రధానంగా సమస్య ఉన్న ప్రాంతంలో నేటికీ పనులు ప్రారంభం కాలేదు. అంతేగాకుండా గాంధీచౌక్ మలుపు నుంచి పాతబజార్ మార్గంలో రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్న పలు ఆలయాలను తొలగించి పునః నిర్మించారు. మరో ఆలయం అలాగే ఉండటంతో పాటు గత ప్రభుత్వ హయంలో కొద్దిగా దెబ్బతిన్న ప్రహరీని సరిచేసి యధావిధిగా మార్చడంతో ఈ ప్రాంతంలో విస్తరణ ఉంటుందా? లేదా.. ఆలయం వరకు అలాగే వదిలేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు యూకో బ్యాంక్ మలుపు నుంచి చల్మారెడ్డి ఆస్పత్రి వరకు రెండేళ్ల కిందట రహదారి విస్తరణ పూర్తయినా.. నేటికీ డివైడర్లను నిర్మించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ మార్గంలో కలెక్టర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే, ఇతర అధికారులు నిత్యం ప్రయాణిస్తున్నా డివైడర్ల ఏర్పాటుపై ఎందుకు చొరవ చూపడం లేదోనని పట్టణవాసులు చర్చించుకుంటున్నారు. పుర కార్యాలయం మలుపు నుంచి చౌడేశ్వరి ఆలయం వరకు పలు ఇళ్లను తొలగించిన అధికారులు రహదారిని మాత్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం లేదు. మరికొన్ని నివాసాలు అలాగే ఉండటం.. బాధితులకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయించినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. వివేకానంద విగ్రహం నుంచి బస్టాండ్ ప్రాంగణం వరకు పలు ఇళ్లు పుర స్థలాన్ని ఆక్రమించి నిర్మించారని గతంలో పుర, ఆర్‌అండ్‌బీ అధికారులు తేల్చడంతో పాటు నోటీసులు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలు తొలగించాలని పట్టుబట్టిన వ్యాపారులతో అధికారులు, ప్రజాప్రతినిధులు జరిపిన చర్చలు సఫలం కావడంతో విస్తరణకు మార్గం సుగమమైందని భావించినా.. నేటికీ వివేకానంద విగ్రహం నుంచి బస్టాండ్ వరకు విస్తరణ పనులు ప్రారంభం కాలేదు.
రహదారి విస్తరణ బాధితులు నష్టపరిహారం ఇవ్వాలని పట్టుబట్టగా అధికారులు టీడీఆర్ (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) అనేది తెరపైకి తెచ్చారు. ఆస్తి కోల్పోయిన యజమానికి డబ్బులకు బదులు టీడీఆర్‌ను జారీ చేస్తుంది. ఈ ధ్రువపత్రాన్ని బాధితులు స్వయంగా వినియోగించుకోవడం లేదా అమ్ముకోవడం చేసుకోవచ్చు. 5 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క టీడీఆర్ కూడా జారీ చేయకపోవడం గమనార్హం. ఈ విధానంపై బాధితులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు విస్తరణ బాధితులకు ప్లాట్ల స్థలాలు కేటాయిస్తారనే ప్రచారం సాగింది. దీనిపై కూడా ఏ మాత్రం స్పష్టత లేదు. విస్తరణపై అన్ని శాఖల అధికారులు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారే తప్పా సమగ్రంగా సమాధానమిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.
నష్టం తక్కువగా ఉండే మర్రికుంట నుంచి రహదారి విస్తరణ పనులు చేపడుతున్నట్లు అధికారులు, అధికారపార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఫుట్‌పాత్‌పై ఉన్న దుకాణాలు, రహదారికి అడ్డుగా ఉన్న చిన్నపాటి నివాసాలను తొలగించి ఇరువైపుల డ్రైనేజీలు నిర్మించారు. ఐదు నెలలుగా అర కిలోమీటర్ పరిధిలోనే పనులు కొనసాగుతుండటం విస్మయం కలిగిస్తోంది. విస్తరణ పూర్తయిన మార్గాల్లో రహదారిని రాకపోకలకు అనుకూలంగా మార్చాలని కోరుతున్నారు.
జిల్లాకేంద్రంలో రహదారి విస్తరణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం కలెక్టరేట్, మర్రికుంట మార్గంలో విస్తరణ పనులతో పాటు డ్రైనేజీ పనులు చేపడుతున్నాం. మొన్నటి వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కాస్త జాప్యం జరిగింది. పట్టణాభివృద్ధి కోసం అందరి సహకారంతో విస్తరణ పనులు చేపడతాం. టీడీఆర్ కోసం ప్రజావాణికి బాధితులు వచ్చారు. దీనిపై కూడా అవగాహన కల్పిస్తాం. – యాదయ్య, పుర ప్రత్యేక అధికారి


