
కేంద్రాల నిర్వాహకులకు పకడ్బందీ శిక్షణ
వనపర్తి: కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు వరి ధాన్యం సేకరణపై బుధ, గురువారం పకడ్బందీ శిక్షణ ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో 2025–26 వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వాహకులకు శిక్షణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలస్థాయిలో మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓల ఆధ్వర్యంలో ఎఫ్‌ఏక్యూ ప్రమాణాలు కలిగిన ధాన్యం గుర్తించడం, తేమశాతాన్ని నిర్ధారించడం, సన్న, దొడ్డు రకాల గుర్తింపై అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా పంట చేతికొచ్చే సమయానికి అనుకూలంగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా గత సీజన్‌లో ఏర్పాటుచేసిన సన్న, దొడ్డు రకం ధాన్యం కేంద్రాల వివరాలను పరిశీలించి ఈసారి ఏర్పాటు చేయబోయే కేంద్రాలపై పలు సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్, డీసీఓ రాణి, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.