
ఉర్సు ఐక్యతకు చిహ్నం..
వనపర్తి రూరల్: గ్రామాల్లో నిర్వహించే ఉర్సు, గ్రామ దేవతల పండుగలు ప్రజల ఐక్యతను చాటి చెబుతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం పెబ్బేరులోని హజ్రత్ షేఖ్ అలీషా తాతయ్య ఉర్సులో వారు వేర్వేరుగా పాల్గొని చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్లెల్లో సర్వమత సమ్మేళనంగా అందరూ అన్ని పండుగలను జరుపుకొంటారని, దీంతో కొత్త వ్యక్తుల మధ్య సైతం స్నేహ బంధం ఏర్పడుతుందని తెలిపారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని పంచిపెట్టారు. వారి వెంట మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ప్రమోదిని, ఉపాధ్యక్షుడు విజయవర్ధన్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, రంజిత్‌కుమార్, సురేందర్‌గౌడ్, వెంకటేష్‌సాగర్, యాపర్ల రాంరెడ్డి, యుగంధర్‌రెడ్డి, వెంకట్రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.