
అమరుల త్యాగం చిరస్మరణీయం
వనపర్తి: దేశ సరిహద్దులో సైనికుడు ఎంత కీలకమో.. రాష్ట్ర భద్రతలో పోలీసులు కూడా అంతే ముఖ్యమని, పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తోందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్‌డే) ఘనంగా నిర్వహించారు. ఎస్పీ రావుల గిరిధర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అధికారులు, సిబ్బందితో కలిసి అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం అమరుల కుటుంబ సభ్యులను పేరుపేరున పరామర్శించి శాలువాతో సన్మానించి చిరు కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా అవసరాలు, రక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీసుశాఖ అన్నారు. సమాజంలో శాంతిస్థాపన కోసం అసాంఘిక శక్తులు జరిపిన పోరులో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని.. వారి స్ఫూర్తితో శాంతిభద్రతల పరిరక్షణకు ముందుకు సాగుతున్నామని తెలిపారు. అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి పోలీసు విధులు, సాంకేతిక వినియోగం, ప్రజారక్షణలో పోలీసుల పాత్ర, ఫ్రెండ్లీ పోలీసింగ్ తదితర విషయాలను విద్యార్థులకు తెలియజేస్తామని చెప్పారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వ్యాసరచన, షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ పోటీలు, రక్తదాన శిబిరాలు, సైకిల్ ర్యాలీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సాయుద దళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, జిల్లా పోలీసు కార్యాలయం ఏఓ సునందన, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సీఐలు కృష్ణయ్య, రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రావుల గిరిధర్