
రుణమాఫీ లెక్క తేలింది
అమరచింత: ప్రభుత్వం ప్రకటించినట్లుగానే చేనేత కార్మికుల రుణమాఫీ ప్రక్రియ చివరి అంకానికి చేరింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.33 కోట్లు కేటాయించడంతో చేనేత, జౌళిశాఖ అధికారులు బ్యాంకుల ద్వారా రూ.లక్ష రుణం పొందిన నేత కార్మికుల వివరాల సేకరణకు ఆయా బ్యాంకు మేనేజర్లకు లేఖలు రాసిన విషయం విధితమే. ఆయా బ్యాంకు మేనేజర్లు తమ బ్యాంకు పరిధిలో చేనేత క్రెడిట్‌కార్డు, రూపే కార్డు, బ్యాంకు రుణం పొందిన వారి వివరాల నివేదికను జౌళిశాఖ అధికారులకు అందజేయగా.. డీఎల్‌సీ (డిస్ట్రిక్ట్ లేవల్ కమిటీ) ముందు ఉంచడం, వారు ఆమోదించడమే మిగిలిందని అధికారులు చెబుతున్నారు. రుణమాఫీ చేయడమే గాకుండా జీవితాల్లో వెలుగులు నింపేందుకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, పెద్దమందడి, కొత్తకోట, ఖిల్లాఘనపురంలో నేత కార్మికులు తమ వృత్తిని నమ్ముకొని కుటుంబాలు పోషించుకుంటున్నారు. పెద్దమందడిలోని వెల్టూర్, ఖిల్లాఘనపురంలోని సోలీపురం గ్రామంలో ఉన్ని మగ్గాలు కొనసాగుతున్నా.. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మగ్గాలపై జరి చీరలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో 1,090 మంది చేనేత కార్మికులు ఉండగా.. 338 జియో ట్యాగింగ్ కలిగిన మగ్గాలు ఉన్నట్లు అధికారులు వివరించారు. ప్రతి మగ్గానికి ముగ్గురు కార్మికుల చొప్పున సంక్షేమ పథకాలు వర్తింపజేస్తున్నారు. అమరచింత చేనేత సహకార సంఘం ద్వారా యూనియన్ బ్యాంక్, ఆత్మకూర్‌లోని డీసీసీబీ బ్యాంకు ద్వారా 309 మంది కార్మికులు చేనేత రుణాలు పొంది ఉన్నారు. ఆత్మకూర్ మండలం తిప్పడంపల్లిలో ఐదుగురు, కొత్తకోటలో 24 మంది నేతన్నలు రుణాలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఒక్కొక్కరు రూ.30 వేల నుంచి రూ.లక్ష, రూ.2 లక్షలకుపైగా రుణాలు తీసుకొని తిరిగి చెల్లిస్తూ తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారని చేనేత సహకార సంఘ కార్యవర్గం చెబుతోంది.
జిల్లావ్యాప్తంగా 2017 ఆర్థిక సంవత్సరం నుంచి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న చేనేత కార్మికుల వివరాలతో పాటు ఎంత మేర మాఫీ వర్తిస్తుందన్న వివరాలను జౌళిశాఖ అధికారులు తెలిపారు. మొత్తం 338 మంది చేనేత కార్మికులు రుణాలు పొందారని.. రూ.2.21 కోట్ల రుణమాఫీ వర్తిస్తుందని వెల్లడించారు.
జిల్లాలో ఇలా..
2017 నుంచి..
రూ.75 వేలు మాఫీ అవుతున్నాయి..
అమరచింత యూనియన్ బ్యాంకులో రూ.75 వేల చేనేత రుణం తీసుకున్నా. ఏటా వడ్డీ చెల్లిస్తూ పునరుద్ధరించుకుంటూ వస్తున్నా. ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ వర్తింపజేస్తామని ప్రకటించడంతో తీసుకున్న రుణం మాఫీ అవుతుందని తెలిసి సంతోషంగా ఉంది. – సాక పద్మ,
చేనేత కార్మికురాలు, అమరచింత
ఆనందంగా ఉంది..
మాది చేనేత కుటుంబం. అందరం నేత పనిపై ఆధారపడి జీవిస్తున్నాం. కుటుంబ పోషణతో పాటు చీరల తయారీకి కావాల్సిన ముడి సరుకు కోసం బ్యాంకులో సహకార సంఘం సిఫారస్ మేరకు రూ.లక్ష రుణం తీసుకున్నా. తిరిగి చెల్లించే స్తోమత లేక ఏటా వడ్డీ డబ్బులు చెల్లిస్తూ రెన్యూవల్ చేసుకుంటూ వస్తున్నా. ప్రభుత్వ ప్రకటనతో రూ.లక్ష మాఫీ అవుతుందని తెలిసి చెప్పలేని ఆనందం కలిగింది.
– క్యామ కుమార్,
చేనేత కార్మికుడు, అమరచింత
నేతన్నలకు ఆసరా..
అమరచింత చేనేత సహకార సంఘం ద్వారా 309 మంది నేత కార్మికులకు అధికారుల సహకారంతో బ్యాంకుల్లో రుణాలు ఇప్పించాం. వ్యాపారం సహకరించక చాలామంది కార్మికులు అప్పుల్లో కురుకుపోయారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించి రుణగ్రస్తుల వివరాలు సేకరించడం సంతోషకరం.
– వగ్గు రామలింగం, ఉపాధ్యక్షుడు,
అమరచింత చేనేత సహకార సంఘం
జిల్లాలో 338 మంది చేనేత కార్మికులు.. సుమారు రూ.2.21 కోట్ల మాఫీ
బ్యాంకుల వారీగా
రుణగ్రస్తుల వివరాల సేకరణ
త్వరలోనే డీఎల్‌సీకి నివేదిక
త్వరలోనే నివేదిస్తాం..
జిల్లావ్యాప్తంగా బ్యాంకుల్లో చేనేత రుణాలు పొందిన 338 మంది వివరాలు సేకరించాం. వీరికి సుమారు రూ.2.21 కోట్ల మేర రుణమాఫీ వర్తించి లబ్ధి పొందనున్నారు. త్వరలోనే జాబితాను డీఎల్‌సీ ఎదుట ఉంచనున్నాం.
– గోవిందయ్య, ఏడీ, చేనేత, జౌళిశాఖ

రుణమాఫీ లెక్క తేలింది

రుణమాఫీ లెక్క తేలింది

రుణమాఫీ లెక్క తేలింది

రుణమాఫీ లెక్క తేలింది