
లక్ష్య సాధనకు కృషి చేయాలి : కలెక్టర్
వనపర్తి రూరల్: విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ధేశించుకొని అందుకు అనుగుణంగా చదివి చేరుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం పెబ్బేరు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. గణితంపై పట్టు సాధించేందుకు సులభ ఫార్ములాలు, స్మార్ట్ ట్రిక్స్ నేర్చుకోవాలని సూచించారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కష్టపడి చదవాలన్నారు. అలాగే పాఠశాలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి మౌలిక వసతులు, విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అబ్ధుల్ ఘనీ, తహసీల్దార్ మురళీగౌడ్, ఎంపీడీఓ రోజా, ఎంఈఓ జయరాములు, ఏఎంఓ మహానంది, అధికారులు పాల్గొన్నారు.