
సర్వే చేసి హద్దులు నిర్ధారించాలి
ఖిల్లాఘనపురం: మండలంలోని మామిడిమాడలో ఎస్సీలకు గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన భూమిని సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. గ్రామంలో 47 ఏళ్ల కిందట ఎస్సీల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం రైతు నుంచి భూమి కొనుగోలు చేసిందని.. సర్వేనంబర్లలో తేడాలు ఉన్నాయని ఫిర్యాదు రావడంతో శుక్రవారం ఆయన తహసీల్దార్ సుగుణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్వేనంబర్ 40లో 1.18 ఎకరాలు, 41లో 0.33 ఎకరాలు మొత్తం 2.11 ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసి పేద ఎస్సీలకు ఇంటి స్థలాలుగా కేటాయించిందన్నారు. ఎవరూ ఇళ్లు నిర్మించుకోకపోవడంతో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన సర్వేనంబర్లలో కాకుండా సర్వేనంబర్లు 40, 42లో నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిసిందని.. త్వరలో సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించామన్నారు. ఏమైనా తేడాలుంటే సంబంధిత రైతుతో మాట్లాడి లిఖితపూర్వకంగా రాయించుకోవాలని సూచించారు. ఆయన వెంట ఆర్‌ఐ తిరుపతయ్య తదితరులు ఉన్నారు.