
కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
వనపర్తి రూరల్: పెట్టుబడిదారుల కోసం కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు పుట్టా ఆంజనేయులు ఆరోపించారు. బుధవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లాకేంద్రంలో చేపట్టిన కార్యక్రమంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, టీయూసీఐ, బీఆర్‌టీయూ, టీఎన్జీయూసీ, ఐసీఈయూ తదితర సంఘాల నాయకులు, కార్మికులు, పలు శాఖల ఉద్యోగులు, రైతులు పాల్గొని మద్దతు తెలిపారు. పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల నుంచి గాంధీచౌక్ ,శంకర్‌గంజ్, కమాన్ చౌరస్తా మీదుగా జూనియర్ కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ జరిగిన సమావేశంలో టీయూసీఐ జిల్లా కార్యదర్శి అరుణ్‌కుమార్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోషా, బీఆర్‌టీయూ జిల్లా నాయకుడు గట్టుయాదవ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని, సంఘం ఏర్పాటు చేసుకొనే హక్కు కష్టతరంగా మార్చిందన్నారు. 1886లో సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని రద్దు చేసి 12 గంటలు పని చేయాలని నిర్ణయించిందని.. రాష్ట్ర ప్రభుత్వం జీఓనంబర్ 282 తీసుకొచ్చి పది గంటలు పని చేయాలని నిర్ణయించడం దారుణమని తెలిపారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించడం పక్కన పెట్టిందని, వేతనాలకు గ్యారెంటీ లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, కాంట్రాక్టు, స్కీం వర్కర్లు, ఔట్‌సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. హమాలీ, రవాణా తదితర రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుచేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు.