
అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
వనపర్తి: ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వర్తించాలని, నూతన చట్టాలపై అవగాహన కల్పించాలని, పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. జిల్లా పరిధిలో శిక్షణ పొంది మొదటిసారి పోలీస్‌స్టేషన్లలో బాధ్యతలు తీసుకున్న ఆరుగురు ఎస్‌ఐలు హిమబిందు, దివ్యారెడ్డి, జె.నరేష్, ఎన్.వేణుగోపాల్, డి.శశిధర్, కె.భాస్కర్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, అంకితభావం, నిజాయితీగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేయాలని సూచించారు. మొదటి పోస్టింగ్‌ను ఎప్పుడూ మరిచిపోమని.. నిర్వర్తించిన విధులు జీవితాంతం గుర్తుండిపోతాయని తెలిపారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, ఏదైనా ఘటన జరిగితే వెంటనే అక్కడికి చేరుకోవాలని, డయల్ 100 ఫిర్యాదులను స్పందించాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పనిచేయని సీసీ కెమెరాలను గ్రామస్తులు, వ్యాపారులతో కలిసి మరమ్మతు చేయించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్ పాల్గొన్నారు.