ఆయకట్టుకు సాగునీరు | - | Sakshi
Sakshi News home page

ఆయకట్టుకు సాగునీరు

Jul 9 2025 7:36 AM | Updated on Jul 9 2025 7:36 AM

ఆయకట్

ఆయకట్టుకు సాగునీరు

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వలకు నీటి విడుదల

4.20 లక్షల ఎకరాలకు నీరందించాలని లక్ష్యం

అసంపూర్తి పనులతో 50 శాతం ఆయకట్టు మాత్రమే సాగు

కేఎల్‌ఐ ప్రాజెక్టు కాల్వల నిర్వహణ పకడ్బందీగా చేపడితేనే ప్రయోజనం

సాక్షి, నాగర్‌కర్నూల్‌: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు నీటి విడుదల ప్రారంభమైంది. మంగళవారం కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు పంప్‌హౌజ్‌ వద్ద రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి కేఎల్‌ఐ కాల్వలకు నీటి సరఫరాను ఆరంభించారు. ఈ సారి కృష్ణానదిలో ముందస్తు వరద ప్రవాహంతో శ్రీశైలం రిజర్వాయర్‌ నిండి.. బ్యాక్‌వాటర్‌ నీటిమట్టం పెరిగింది. పుష్కలంగా సాగునీరు అందుబాటులో ఉండటంతో ఆయకట్టు రైతులు పంటల సాగుకు సన్నద్ధమయ్యారు. బోరుబావుల కింద సాగుచేస్తున్న రైతులు ఇప్పటికే వరినార్లు, విత్తనాలు వేసుకోగా.. కాల్వల కింద సాగుచేస్తున్న రైతులు నీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఆయకట్టుకు నీటి విడుదల చేయడంతో రైతులు పంటల సాగులో నిమగ్నమయ్యారు.

లక్ష్యం 4.20 లక్షలు.. ఇచ్చేది 2.5 0లక్షల ఎకరాలకే..

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో మొత్తం 4.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటివరకు చేపట్టిన పనులు, రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణం మేరకు 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు మించి నీరందించలేని పరిస్థితి నెలకొంది. పూర్తిస్థాయిలో నీటి సరఫరా చేపట్టాలంటే.. పెండింగ్‌ పనులను వేగంగా పూర్తిచేయాల్సి ఉంది. అయితే కేఎల్‌ఐ పనులు పూర్తిచేయడంలో ఏళ్లుగా జాప్యం కొనసాగుతుండటంతో ఈ సారి సైతం పరిమితంగానే ఆయకట్టు రైతులకు నీరు అందించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ప్రధానంగా కేఎల్‌ఐ విస్తరణ పనుల్లో భాగమైన 28, 29, 30 ప్యాకేజీల్లో పెండింగ్‌ పనులు పూర్తికాలేదు. కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ, అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండలాల్లో చివరి వరకు నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు.

నిండుకుండలా శ్రీశైలం జలాశయం..

ఎగువన కురుస్తున్న వర్షాలతో ఈ సారి కృష్ణానదికి జూన్‌లోనే వరద పెరిగింది. పది రోజులుగా వరద పెరిగి.. జూరాల, శ్రీశైలం జలాశయాల్లో పెద్దఎత్తున చేరింది. సాధారణంగా జూలై నెలాఖరు, ఆగస్టు నెలల్లో నిండే శ్రీశైలం రిజర్వాయర్‌.. ఈ సారి జూలై మొదటి వారంలోనే పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యానికి చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలకు గాను ఇప్పటికే 199.27 టీఎంసీలకు చేరింది. ఎగువన జూరాల ప్రాజెక్టు, సుంకేసుల నుంచి లక్షనర్నర క్యూసెక్కుల వరద వస్తుండటంతో మంగళవారం శ్రీశైలం రిజర్వాయర్‌ నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 15 రోజులుగా శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం పెరిగి.. పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నప్పటికీ కేఎల్‌ఐ ఆయకట్టుకు నీటి విడుదలలో జాప్యం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం వారం రోజుల ముందుగానే నీటిని విడుదల చేస్తే ఇప్పటికే సాగులో ఉన్న రైతులకు ఉపయుక్తంగా ఉండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు.

నిర్వహణ చేపడితేనే ప్రయోజనం..

కేఎల్‌ఐ కింద మూడు లిఫ్టుల్లో మోటార్ల ద్వారా నీటి ఎత్తిపోతలు చేపడుతున్నారు. మొదటి లిఫ్టు ద్వారా ఎల్లూరు జలాశయంతో పాటు సింగోటం రిజర్వాయర్‌, రెండో లిఫ్టు ద్వారా జొన్నలబొగుడ రిజర్వాయర్‌, మూడో లిఫ్టుతో గుడిపల్లి రిజర్వాయర్‌ను నింపాల్సి ఉంటుంది. వీటికి అనుసంధానంగా ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌లను పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో.. ప్రస్తుతం చెరువులను మాత్రమే నింపేందుకే అధికారులు పరిమితమవుతున్నారు. ఒక్కో రిజర్వాయర్‌ నీటినిల్వ సామర్థ్యం సైతం ఒక టీఎంసీలోపే కావడంతో ఎక్కువ నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేదు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌, నెట్‌వర్క్‌ చానల్స్‌ లేకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. మూడు ప్రధాన రిజర్వాయర్లలో నీరు ఖాళీ అయ్యే కొద్దీ ఎప్పటికప్పుడు మోటార్లతో నీటిని ఎత్తిపోసుకోవడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది.

నిర్వహణలో నిర్లక్ష్యం..

సాగునీటికి ఇబ్బంది లేకుండా..

కేఎల్‌ఐ కింద ఆయకట్టుకు నీటి సరఫరా ప్రారంభమైంది. రిజర్వాయర్లను ఎప్పటికప్పుడు ఎత్తిపోతల ద్వారా నీటితో నింపేలా చర్యలు తీసుకుంటాం. ఆయకట్టు రైతులకు సాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తాం. మోటార్ల మరమ్మతు, నిర్వహణ పనులు చేపడుతున్నాం. – విజయభాస్కర్‌రెడ్డి, సీఈ,

నీటిపారుదల శాఖ

ప్రాజెక్టు కింద చేపట్టిన మూడు లిఫ్టుల్లోనూ ఐదేసి మోటార్లతో నీటి ఎత్తిపోతలను చేపట్టాల్సి ఉండగా.. ప్రతిసారి రెండు మోటార్లకు మించి పని చేయడం లేదు. మిగతా మోటార్ల మరమ్మతు కోసం ఏళ్ల సమయం పడుతోంది. కృష్ణానదిలోని నీటిని తీసుకునే ఇన్‌టెక్‌ వద్ద సర్జ్‌పూల్‌ నుంచి పంప్‌హౌస్‌లోకి నీరు చేరకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇక్కడి గేట్లకు మరమ్మతు, నిర్వహణ లేక తుప్పుపట్టి బలహీనంగా మారుతున్నాయి. సరైన నిర్వహణ లేకపోతే గేట్లు పనిచేయని పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. మోటార్ల నిర్వహణతో పాటు పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఆయకట్టుకు సాగునీరు 
1
1/1

ఆయకట్టుకు సాగునీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement