
కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ఆత్మకూర్: కేసుల దర్యాప్తును వేగవంతం చేసి ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దిగువ జూరాల జల విద్యుత్‌కేంద్రం వద్ద జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు, వర్టికల్స్, డయల్ 100, బ్లూకోర్టు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు, బీట్ సిస్టం సిబ్బందితో నెలవారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్‌స్టేషన్లలో వర్టికల్స్ పనితీరును నిత్యం పర్యవేక్షిస్తుండాలని, ఫిర్యాదు స్వీకరించిన వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని, సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కోరారు. నేరస్తులను త్వరగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాలని, బీట్ సిస్టంను మరింత పటిష్టపర్చాలని, దొంగతనాలు జరగకుండా ముమ్మరంగా గస్తీ నిర్వహించాలని, ఎక్కడబడితే అక్కడ మద్యం తాగకుండా, అమ్మకాలు జరగకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. మైనర్లు వాహనాలు నడపకుండా చూడాలని, పట్టుబడితే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని, డ్రంకెన్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రం సందర్శన..
దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాన్ని ఎస్పీతో పాటు జిల్లాలోని సీఐలు, ఎస్‌లు సందర్శించారు. వియ్యర్, స్విచ్‌యార్డు, పవర్‌హౌజ్‌ను పరిశీలించి విద్యుత్ తయారీ తదితర వివరాలను జన్‌కో అధికారులను అడిగి తెలుసుకున్నారు. డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వర్‌రావు, డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, సీఐలు శివకుమార్, రాంబాబు, కృష్ణయ్య, ఎస్‌ఐలు నరేందర్, తిరుపతిరెడ్డి, సురేష్, శేఖర్‌రెడ్డి, జిల్లాలోని ఎస్‌ఐలు, కోర్టు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామ పోలీస్ అధికారులు నిత్యం పర్యటించాలి
ఎస్పీ రావుల గిరిధర్