
197 మంది విద్యార్థులు గైర్హాజరు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. సోమవారం ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు జరిగాయని.. సిబ్బంది విద్యార్థులను తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారని వివరించారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షలకు 1,907 మంది విద్యార్థులకుగాను 1,755 మంది హాజరుకాగా.. 152 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 607 మంది విద్యార్థులకుగాను 562 మంది హాజరుకాగా 45 మంది రాలేదని వివరించారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు నరేంద్రకుమార్, శ్రీనివాసులు పెబ్బేర్, కొత్తకోట పరీక్ష కేంద్రాలను, జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాన్ని తాను తనిఖీచేసినట్లు తెలిపారు.
రామన్‌పాడులో 1,016 అడుగులు
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో సోమవారం సముద్ర మట్టానికిపైన 1,016 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వల ద్వారా జలాశయానికి నీటి సరఫరా నిలిపివేశారని.. రామన్‌పాడు జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని వివరించారు.