
పీఎఫ్, కేవైసీలో తప్పులు సరిచేయాలి
అమరచింత: పీఎఫ్, కేవైసీలో తప్పులను వెంటనే సరిచేయాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బీడీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని ప్రావిడెంట్ ఫండ్ రీజినల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 2 వేల మంది బీడీ కార్మికులు పీఎఫ్, కేవైసీ కానీ ఫలితంగా తమ పీఎఫ్‌లో జమ చేసుకున్న రూ.కోట్లు అందుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రావిడెంట్ ఫండ్ చట్టం కార్మికుల సంక్షేమం, సోషల్ సెక్యూరిటీ కోసం ఏర్పడిందన్నారు. కానీ, 20 మంది పనిచేసే దగ్గర పీఎఫ్ అమలు చేయాల్సి ఉన్న రాష్ట్రంలో లక్షలాది మంది కార్మిక వర్గానికి అమలు కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జమ చేసుకున్న డబ్బులను తీసుకోవడం కోసం సరళమైన పద్ధతిలో విత్ డ్రా సిస్టం రూపొందించాలని కోరారు. లేని పక్షంలో భవిష్యత్‌లో వేలాది మంది బీడీ కార్మికులతో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 25 ఏళ్ల కిందట నమోదు చేసుకున్న పేర్లు, ఇంటి పేర్లు, పుట్టిన తేదీలు 2013లో వచ్చిన ఆధార్‌కు తేడా ఉండటంతో పీఎఫ్ కేవైసీలు కావడం లేదని వీటిని వెంటనే పునరుద్ధరించి బీడీ కార్మికులకు న్యాయం చేయాలని కమిషనర్ శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రగతిశీల బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి అరుణ్ కుమార్, నాయకులు దేవదానం, బాలకిష్టమ్మ, బాలయ్య, దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు శిక్షణ
వనపర్తి విద్యావిభాగం: ఉపాధ్యాయ వృత్యంత శిక్షణ ఉపాధ్యాయులకు ఐదు రోజులపాటు శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. జిల్లాకేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో మ్యాథ్స్, సోషల్, ఇంగ్లిష్, జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో జీహెచ్‌ఎం తెలుగు ఫిజికల్ సైన్స్, జెడ్పీహెచ్‌ఎస్ ఉర్దూ మీడియంలో బయాలజీ ఫిజికల్ డైరెక్టర్లు, జెడ్పీహెచ్‌ఎస్ హరిజనవాడలో హిందీ సబ్జెక్టు ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ శిబిరాలు ప్రారంభం కాగా మంగళవారం డీఈఓ అబ్దుల్ గని శిబిరాలను సందర్శించి ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ బోధన, డిజిటల్ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను ప్రతి పాఠశాలలో పెంచాలని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలని చెప్పారు.
గ్రామీణ విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలి
వనపర్తి రూరల్: గ్రామీణ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు అన్ని రంగాల్లో పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని డీఈఓ అబ్దుల్ గని అన్నారు. మంగళవారం పెబ్బేరు మండలంలోని యాపర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం శంకర్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వం విద్యను అన్నివర్గాలు, అన్ని ప్రాంతాల వారికి చేరువ చేసిందన్నారు. ప్రతిఒక్కరూ ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోటీ పడుతూ ఫలితాలు సాధించాలన్నారు. గ్రామానికి చెందిన దాత ఎన్‌ఆర్‌ఐ సూదిరెడ్డి శ్రీహరిరెడ్డి రూ.40 వేల విలువ చేసే బంగారు నాణేలు అందజేయడం ప్రశంసనీయమని కొనియాడారు. హెచ్‌ఎం మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ సూదిరెడ్డి శ్రీహరిరెడ్డి పాఠశాల అభివృద్ధికి ఎంతో నగదు సహాయం అందించారని, అలాగే పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులకు 4 గ్రాముల బంగారు నానేలు ఇస్తామని ప్రకటించి, అందజేశారని చెప్పారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులు శివాని, శివలక్ష్మిలకు డీఈఓ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు, దాత తండ్రి నరేందర్‌రెడ్డి, హెచ్‌ఎంతో కలిసి శాలువాతో సన్మానించి ఒక్కొక్కరికి 2 గ్రాముల బంగారు నాణేలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి చంద్రశేఖర్, ఏఎంఓ మహానంది, గ్రామస్తులు స్వరాజ్యం, బాబురెడ్డి, ఉపాధ్యాయులు మైనొద్దీన్, ఈశ్వర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

పీఎఫ్, కేవైసీలో తప్పులు సరిచేయాలి