
రైతుల మేలు కోసమే రైతు నేస్తం
మదనాపురం: రైతుల మేలు కోసమే ప్రభుత్వం రైతునేస్తం కార్యక్రమం అమలు చేస్తుందని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌నాయక్ అన్నారు. మంగళవారం స్థానిక రైతువేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఖరీఫ్ సీజన్‌పై అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ ప్రతి రైతు తన భూమి వివరాలను ధ్రువీకరించుకొని ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడానికి ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. పంటల ముందస్తు నమోదు ద్వారా విత్తనాలు, ఎరువులు వంటి ఇన్‌పుట్స్ సమర్థవంతంగా పంపిణీ చేయడానికి ఇది దోహదపడుతుందన్నారు. ఆయిల్‌పాం పంట ద్వారా మార్కెట్‌లో డిమాండ్ మెరుగుపడే అంశాలు, పంట మార్పిడి, ప్రాసెసింగ్ పరిశ్రమలు అందుబాటులో ఉండటం వల్ల ఆదాయ వృద్ధి జరుగుతుందని వివరించారు. నేల పరీక్ష పునరుద్ధరణ చర్యలు, సరైన పంటల ఎంపిక, ఎరువుల వినియోగం, పొలాల సంరక్షణకు అవసరమైన చర్యలపై అవగాహన కల్పించారు. ఆధునిక టెక్నాలజీ ఆధారంగా వ్యవసాయాన్ని మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దడం అవసరమన్నారు.