పేరుకుపోతున్న ధాన్యం.. | - | Sakshi
Sakshi News home page

పేరుకుపోతున్న ధాన్యం..

May 11 2025 12:30 PM | Updated on May 11 2025 12:30 PM

పేరుకుపోతున్న ధాన్యం..

పేరుకుపోతున్న ధాన్యం..

గట్టు: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం రాసులు పేరుకుపోతున్నాయి. దీంతో రైతులు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ఎప్పుడెప్పుడు చేస్తారా అంటూ వేయ్యికళ్లతో రైతులు ఎదురు చూస్తున్నారు. సరిపడా గన్నీ బ్యాగులను కొనుగోలు కేంద్రాలకు పంపక పోవడంతో ధాన్యం కొనుగోలు నత్తనడకసాగుతున్నట్లు రైతులు ఆరోపించారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుకు సంబందించి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక గట్టు విషయానికి వస్తే.. మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ధాన్యం కొనుగోళ్లు అప్పగించారు. గట్టు, మాచర్ల, పెంచికలపాడు, ఆలూరు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి దాకా ఆయా కొనుగోలు కేంద్రాల దగ్గర 292 మంది రైతులకు సంబంధించి 33,786 బస్తాలు(40కేజీలు), 13,514 క్వింటాళ్లను కొనుగోలు చేసినట్లు సహకార సంఘం అధికారులు తెలిపారు. ఇవి కాక మరిన్ని ధాన్యం రాసులు కొనుగోలు కేంద్రాల దగ్గర అలాగే ఉండిపోయాయి. గట్టులో సుమారుగా 30 వేల బస్తాలు, మాచర్లలో సుమారుగా 25 వేల బస్తాలు, పెంచికలపాడులో 15వేల బస్తాలు, ఆలూరులో 12వేల బస్తాల వరకు కొనుగోలు చేయాల్సి ఉన్నట్లు అంచనా. బయటి మార్కెట్‌ కన్నా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న చోట వడ్ల ధర అధికంగా ఉండడంతో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు ఆసక్తిని చూపుతున్నారు. అకాల వర్షాల వలన వడ్లు తడిస్తే ఇబ్బంది అని రైతులు వాపోతున్నారు. అధికారులు త్వరగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

లారీలు, గన్నీ బ్యాగుల కొరత

గన్నీ బ్యాగులు లేక వడ్ల కొనుగోలు మరింత ఆలస్యం అవుతున్నట్లు రైతులు ఆరోపించారు. గన్నీ బ్యాగుల కోసం ఎదురుచూస్తున్నట్లు రైతులు తెలిపారు. ఇప్పటి వరకు 4 కొనుగోలు కేంద్రాలకు కేవలం 33వేల గన్నీ బ్యాగులు మాత్రమే పంపారని, ఇంకా సుమారుగా 80 వేల బస్తాలు అవసరం ఉన్నట్లు అంచనా. ఇక కొనుగోలు చేసిన వడ్లను మిల్లులకు తరలించేందుకు లారీల సమస్య నెలకొంది. ఇప్పటిదాకా పంపిన గన్నీ బ్యాగులకు సంబందించి వడ్లను తూకం వేసిన అధికారులు వాటిని మిల్లులకు తరలించేందుకు వాహనాలు లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల దగ్గరే ఉండిపోయినట్లు అధికారులు తెలిపారు. తూకం పట్టిన వడ్ల బస్తాలు సుమారుగా 3వేల వరకు కొనుగోలు కేంద్రాల దగ్గరే ఉండిపోయినట్లు సమాచారం. ఇదిలాఉండగా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన వడ్లను పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేష్‌, సీఈఓ భీమిరెడ్డి తెలిపారు. గన్నీ బ్యాగుల కొరత కారణంగా కొనుగోలు ఆలస్యమవుతుందని, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు తెలిపారు.

కొనుగోలు కేంద్రాల్లో వేధిస్తున్న గన్నీ బ్యాగుల కొరత

కొన్న ధాన్యం తరలింపునకు ఇబ్బందులు

రైతులకు తప్పని పడిగాపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement