
సజావుగా ధాన్యం సేకరణ
పాన్‌గల్: కొనుగోలు కేంద్రాల్లో కాంటా చేసిన ధాన్యం జాప్యం లేకుండా వెంటనే మిల్లులకు తరలిస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం సేకరణ, నిల్వలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. గత యాసంగిలో 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే ఈ ఏడాది 4 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు. ప్రస్తుతం కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని మరో రెండ్రోజుల్లో పూర్తిగా తరలించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులు కేంద్రాలకు తాలు, మట్టి, గడ్డి లేకుండా ధాన్యం తీసుకురావాలని, అలాంటి ధాన్యంలో తరుగు తీస్తే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం చిరిగిన బస్తాల్లో కాకుండా కొత్త బస్తాల్లో నింపాలని సూచించారు. లారీలు సక్రమంగా రాకపోవడంతో ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతోందని, దీంతోపాటు సేకరణ కూడా మందకొడిగా సాగుతుందని పలువురు రైతులు జేసీ దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు ఆయన స్పందిస్తూ.. మిల్లర్లతో మాట్లాడి లారీలను సమకూర్చాలని సూచించారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయంలో సింగిల్‌విండో, ఐకేపీ సిబ్బందితో సమావేశమై కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, సేకరణపై అధికారులతో ఆరా తీశారు. కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, ధాన్యం సేకరణ, రైతుల ఇబ్బందుల గురించి సీపీఎం మండల కార్యదర్శి బాల్యానాయక్ జేసీకి వివరించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో సీఈఓ భాస్కర్‌గౌడ్, ఐకేపీ ఏపీఎం వెంకటేష్‌యాదవ్, ఆ యా కార్యాలయాల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.