
విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవించాలి
వనపర్తి టౌన్: విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవిస్తూ వారు మెచ్చేలా విజయాలు సాధిస్తే భవిష్యత్ తరాలు బాగుపడతాయని అంబాత్రేయ క్షేత్ర వ్యవస్థాపకుడు ఆదిత్య పరాశ్రీ స్వామిజీ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రం సమీపంలో అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు ఆవరణలో వేప, రావి మొక్కలు నాటారు. అలాగే సామాజిక కార్యకర్త పోచ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బాలుర, బాలికల, హరిజనవాడ, తెలుగువాడ ఉన్నత ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఆశీర్వదించి మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు సర్వం ధారపోస్తున్నారని.. నైపుణ్యం కలిగిన చదువుకు సమాజంలో విలువ పెరుగుతుందని, విద్యార్థులు అక్షర, లోక జ్ఞానాన్ని తెలుసుకునేందుకు విద్యారంగంలో పురోగమించడమే ఏకై క మార్గమన్నారు. విద్యార్థులు కృషిని నమ్ముకొని దైవచింతన, సరైన ప్రణాళికతో ముందుకుసాగితే ప్రతి అడుగులోనూ విజయం తారసపడుతుందని చెప్పారు. యువతరం సన్మార్గం వైపు పయనించేందుకు పాఠ్య పుస్తకాల్లోనూ అధ్యాత్మిక భావన, సైన్స్ భావజాలాన్ని మేళవింపు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. రోజురోజుకు పడిపోతున్న విలువల పునరుద్ధరణలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. సామాజిక కార్యకర్త పోచ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగంలో అధ్యాత్మికత లోపించడంతోనే వ్యవస్థ భ్రష్టు పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థులను సన్మానించి మిఠాయి బాక్స్‌లను అందించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్, ఉపాధ్యాయులు తిరుపతి, రవికుమార్, రమాదేవి, గురురాజ్‌ప్రసాద్, నాయకులు దాడి యోగానందరెడ్డి, కంది వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.