కాంగ్రెస్‌కు షాక్‌.. | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు షాక్‌..

Nov 6 2023 2:00 AM | Updated on Nov 6 2023 2:00 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో
కొండా ప్రశాంత్‌రెడ్డి - Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కొండా ప్రశాంత్‌రెడ్డి

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం గుడ్‌బై

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు షాక్‌ తగిలింది. నియోజకవర్గ హస్తం టికెట్‌ ఆశించి భంగపడిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్‌ కుమార్‌గౌడ్‌ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అంతేకాదు మరో ఆశావహనాయకుడు, యువనేత కొండా ప్రశాంత్‌రెడ్డి సైతం అదే దారిలో పయనించడం సెగ్మెంట్‌లోని కాంగ్రెస్‌ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే దేవరకద్ర కాంగ్రెస్‌ అభ్యర్థిగా జి.మధుసూదన్‌రెడ్డిని ప్రకటించిన క్రమంలో అటు కాటం, ఇటు కొండా సంయుక్తంగా తమ అనుచరులతో భేటీ అయి అభ్యర్థిని మార్చాలని డిమాండ్‌ చేశారు. కానీ ఆ తర్వాత పరిణామాల క్రమంలో కాటం తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్‌ వైపు అడుగులు వేస్తుండగా.. కొండా బీజేపీ వైపు చూస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

అనుచరులతో కాటం భేటీ..

దేవరకద్ర కాంగ్రెస్‌ అభ్యర్థిగా మార్చాలని పార్టీ కార్యాలయంలో నిరసన తెలిపిన కాటం ప్రదీప్‌ కుమార్‌గౌడ్‌.. అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆదివారం ఆయన తన అనుచరులతో భూత్పూర్‌ మండలంలోని ఓ ప్రముఖ నాయకుడి ఫామ్‌హౌస్‌లో సమావేశమయ్యారు. సీనియార్టీకి విలువ ఇవ్వకుండా కొత్తగా వచ్చిన నాయకునికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వడంతో పాటు ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని సేకరించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల అధ్యక్షులు రాందాసు, వెంకటేశ్వర్‌రెడ్డి, కురుమూర్తి దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్‌ రాధాకృష్ణారెడ్డి, టీపీసీసీ నాయకులు వేణుగోపాల్‌, దేవరకద్ర మాజీ ఎంపీపీ భగవంతగౌడ్‌, లాల్‌కోట ఎంపీటీసీ శివరాజు, ఓబీసీ జిల్లా నాయకులు బాల్‌చందర్‌గౌడ్‌, మైనార్టీ నాయకులు ఫసియొద్దీన్‌, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు వెంకటేశ్‌, క్రాంతిగౌడ్‌, అక్కి రాఘవేంద్రగౌడ్‌తో పాటు పలువురు కార్యకర్తలు హాజరు కాగా.. కాంగ్రెస్‌ను వీడాలని ముక్తకంఠంతో నినదించారు. ఈ మేరకు కాటం తనలతో పాటు తన అనుచరులు కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు మీడియా సమావేశంలో ప్రకటించారు. ధనార్జనే ధేయంగా కాంగ్రెస్‌ టికెట్లను అమ్మ్ముకున్నారని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు.

నేటి ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్‌కు..?

30 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నానని, పార్టీని నమ్ముకున్న వారి పట్ల రాష్ట్ర నాయకత్వం విలువ ఇవ్వకపోవడం చాలా బాధకరంగా ఉందని కాటం సమావేశంలో వ్యాఖ్యానించారు. తన అనుచరులు, కార్యకర్తల కోరిక మేరకు పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. వారి అభీష్టం మేరకు ఏ పార్టీలో చేరుతామనే విషయం త్వరలో ప్రకటిస్తామని ఆయన వెల్లడించినప్పటికీ.. బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇది వరకే గులాబీ నేతల నుంచి ఆహ్వానం అందగా.. సోమవారం దేవరకద్రలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ సమక్షంలో కాటంతో పాటు ఆయన అనుచరులు కారెక్కనున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

అదే దారిలో యువనేత

కొండా ప్రశాంత్‌రెడ్డి..

నేటి సభలో కేసీఆర్‌ సమక్షంలో

ప్రదీప్‌ బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

కిషన్‌రెడ్డితో కొండా భేటీ

కమలం నుంచి

పోటీ చేసేందుకు యత్నాలు

కొండా ప్రశాంత్‌రెడ్డి బీజేపీలోకి?

కాంగ్రెస్‌ దేవరకద్ర నియోజకవర్గ టికెట్‌ ఆశించి భంగపడిన టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కొండా ప్రశాంత్‌రెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి జీఎమ్మార్‌ను మార్చాలని డిమాండ్‌ చేస్తున్న ఆయన ఆదివారం టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని కలిసినట్లు తెలిసింది. ఇన్నాళ్లుగా పార్టీలో కష్టపడుతూ సేవలందిస్తున్నానని.. తనకు పార్టీలో ప్రాధాన్యం కల్పించేలా పదవి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. సరైన స్పందన రాకపోవడంతో ఆయన బీజేపీ వైపు మొగ్గుచూపి.. తన అనుచరులతో కలిసి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలిశారు. డోకూర్‌ పవన్‌కుమార్‌రెడ్డి పోటీకి విముఖత చూపుతున్న నేపథ్యంలో ఆయన బీజేపీ టికెట్‌ ఆశించి.. ఆయనను కలిసినట్లు తెలుస్తోంది. బీజేపీ కూడా ఈ నియోజకవర్గంలో బలమైన నాయకుని కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్‌ అసమ్మతి నేత కొండా ప్రశాంత్‌రెడ్డి కమలం తీర్థం పుచ్చుకునేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. అన్ని అనుకూలిస్తే హైదరాబాద్‌లో ప్రధానమంత్రి మోదీ సభలో ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మద్దతుదారులతో మాట్లాడుతున్న
కాటం ప్రదీప్‌కుమార్‌గౌడ్‌1
1/1

మద్దతుదారులతో మాట్లాడుతున్న కాటం ప్రదీప్‌కుమార్‌గౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement