
ఖిల్లాఘనపురం: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరినప్పుడే అన్నివర్గాలు, కులాల వారికి సంక్షేమ ఫలాలు అందుతాయని మాజీ మంత్రి, ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి అన్నారు. శుక్రవారం కాంగ్రెస్‌పార్టీ మండలాధ్యక్షుడు విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంతో పాటు వెంకటాంపల్లి, ఆగారం, అంతాయపల్లి, కొత్తపల్లి, మొగిలికుంటతండా, తిరుమలాయపల్లి, కమాలోద్ధీన్‌పూర్‌లో హాథ్ సే హాథ్ జోడోయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇల్లిల్లూ తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలోనే రైతులు, మహిళలు, యువతకు మేలు జరిగిందన్నారు. నేడు ప్రత్యేక రాష్ట్రంలో రాజరిక పాలన కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.500కే గ్యాస్ సిలిండర్, పట్టాదారులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరాకు ఏడాదికి రూ.15 పంట సాయం, ఉపాధి కూలీలకు ఏడాదికి రూ.12 వేలు అందిస్తామని వివరించారు. పంటలకు గిట్టుబాటు ధరతో పాటు ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు రమేష్, ఎంపీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి, నాయకులు కృష్ణయ్యయాదవ్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు రోహిత్, జిల్లా సోషల్ మీడియా కో–ఆర్డినేటర్ దేవన్న యాదవ్, డా. నరేందర్‌గౌడ్, బాలరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి డా. చిన్నారెడ్డి