కొత్తకోట: పట్టణంలోని జీటీ నారాయణ పాఠశాలలోని ఓ గదిని శుక్రవారం జిల్లా విద్యాధికారి సీజ్ చేసినట్లు ఎంఈఓ కృష్ణయ్య తెలిపారు. తప్పుడు పత్రాలు ఇస్తున్నట్లు ఆరోపణలు రావడంతో మూడేళ్ల క్రితం పాఠశాలను అప్పటి జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా అదే పాఠశాలకు పక్కనే ఉన్న మరో గది నుంచి పాఠశాల కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో పాటు అనధికారికంగా హాస్టల్ కొనసాగుతున్నట్లు అధికారులకు ఫిర్యాదు అందడంతో శుక్రవారం జిల్లా విద్యాధికారితో పాటు తహసీల్దార్ బాల్‌రెడ్డి, ఎంఈఓ కృష్ణయ్య, పుర కమిషనర్ శ్రీనివాసులు, ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి సందర్శించారు. ఆ సమయంలో పాఠశాల కరస్పాండెంట్ రాఘవేందర్ అందుబాటులో లేకపోవడంతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరోగదిని కూడా అధికారులు తాళం వేసి సీజ్ చేశారు. పాఠశాలలో నిర్వహించే హాస్టల్‌కు ఎలాంటి అనుమతి లేదని ఫుడ్ సేఫ్టీ అధికారిణి పాఠశాల ఆవరణలో నోటీసు అంటించారు. 14 రోజుల్లో హాస్టల్‌కు కావాల్సిన అన్నిరకాల అనుమతులు తీసుకోవాలని అధికారులు నోటీసులు జారీ చేసినట్లు ఎంఈఓ వివరించారు.
ఉత్తమ పురస్కారం
అందజేత
ఖిల్లాఘనపురం: రాష్ట్ర ప్రభుత్వం 2021–22 సంవత్సరానికిగాను రాష్ట్రస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీలను ఇటీవల ప్రకటించింది. పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాల పెంపు విభాగంలో మండలంలోని సోళీపురం గ్రామపంచాయతీ తృతీయస్థానంలో నిలిచింది. శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రులు కేటీఆర్, దయాకర్‌రావు సర్పంచ్ టి.పద్మశ్రీ, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్‌కు ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా పలుగ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, జిల్లా, మండలస్థాయి అధికారులు అభినందనలు తెలిపారు.
రేపు ఎమ్మెల్యే సీతక్క రాక
అమరచింత: మండలంలోని రేచింతలలో ఆదివారం నిర్వహించే ఇందిరాగాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహిళా కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరవుతున్నట్లు టీపీసీసీ అధికార ప్రతినిధి కేశం నాగరాజ్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం ఆత్మకూర్‌లో నిర్వహించిన మండల కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఆయనతో పాటు రాష్ట్ర నాయకులు ప్రశాంత్‌రెడ్డి, పోలీస్ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని.. గరీబీ హటావో నినాదంతో దేశ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకొన్నారని కొనియాడారు. ప్రధాని మోదీ అరాచక పాలన కొనసాగిస్తున్నారని.. జాతి కోసం, దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ కుటుంబాలపై లేనిపోని ఆరోపణలు చేస్తూ అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలకులకు సరైన సమయంలో ప్రజలు బుద్ది చెబుతారన్నారు. విగ్రహావిష్కరణకు నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో విష్ణువర్ధన్‌రెడ్డి, డీసీసీ ప్రధానకార్యదర్శి అయూబ్‌ఖాన్, గంగాధర్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు పరమేష్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బాలకిష్టన్న, శ్రీనివాస్, తులసీరాజ్ తదితరులు పాల్గొన్నారు.


