ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థుల వివరాలను ప్రతి ఏటా తరగతుల వారీగా విద్యాశాఖ యూడైస్ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. ప్రతి ఒక్క విద్యార్థి వివరాలను ఎంఈఓ లాగిన్ ద్వారా నమోదు చేస్తారు. ఎవరైనా విద్యార్థి వేరే స్కూల్‌లో చేరాలనుకుంటే ప్రస్తుతం చదువుతున్న పాఠశాలకు ట్రాన్స్‌ఫర్ కోసం దరఖాస్తు చేయాలి. ఆ స్కూల్ హెచ్‌ఎం అనుమతి తీసుకోవాలి. తీసుకోని పక్షంలో ఆ విద్యార్థిని వేరే పాఠశాలలో చేర్చుకునే అవకాశం లేదు. కానీ ఆయా కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు అడ్డదారుల్లో ఈ తతంగం నడిపిస్తున్నారు. ఎంఈఓ లాగిన్ నుంచి అక్రమాలకు తెరలేపారు. గతంలో చదివిన స్కూల్‌తో సంబంధం లేకుండా.. తమ వద్దే అన్ని తరగతులు చదివినట్లు లేదంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి బోగస్ రికార్డులు సృష్టిస్తున్నారు. నేరుగా వారు ఎంఈఓల లాగిన్ నుంచే ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఎంఈఓ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, డీఈఓ కార్యాలయంలోని పలువురు ఉద్యోగులు, సిబ్బందికి ముడుపులు అందజేస్తున్నట్లు సమాచారం.