జెడ్పీ సమావేశానికి సభ్యుల డుమ్మా

సభ్యులు రాకపోవడంతో ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు - Sakshi

వనపర్తి: జెడ్పీలో రాజకీయ దుమారం రేగింది. ఇటీవల జెడ్పీ చైర్మన్‌ ఆర్‌.లోక్‌నాథ్‌రెడ్డి, ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయటం మంగళవారం నాటి జెడ్పీ సర్వసభ్య సమావేశంపై ప్రభావం చూపించింది. చైర్మన్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు మాత్రమే హాజరయ్యారు. అత్యధికంగా ఉన్న గులాబీ పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులతో పాటు ఎక్స్‌అఫీషియో హోదా కలిగిన మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం గైర్హాజరయ్యారు. ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా.. మధ్యాహ్నం 12.30 వరకు వేచిచూసినా సభ్యులు రాకపోవటంతో బుధవారం ఉదయం 10.30కు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ వెల్లడించారు. జెడ్పీ సమావేశ మందిరం ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది.

ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం..

హెల్త్‌ గ్రాంట్‌ రూ.73 లక్షలు, మరో పద్దు రూ.2 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.50 కోట్లు, ఎస్‌ఎఫ్‌సీ గ్రాంట్స్‌ రూ. 5.50 కోట్ల వినియోగ తీర్మానాలు చేసేందుకే జెడ్పీ సమావేశం నిర్వహించామని జెడ్పీ చైర్మన్‌ ఆర్‌.లోక్‌నాథ్‌రెడ్డి అన్నారు. స్వార్థ రాజకీయాల కంటే ప్రజా సంక్షేమానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో పని చేస్తున్నామని తెలిపారు. రాజకీయ దురుద్దేశంతో జెడ్పీటీసీ సభ్యులను సభకు రానివ్వకుండా.. తీర్మానాలు చేయనివ్వకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. బుధవారం నాటి సమావేశానికై నా మంత్రి, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. తనపై కోపం ఉంటే ఆ స్థానంలో మరొకరిని నియమించి జిల్లాను అభివృద్ధి చేయాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు లభిస్తాయనుకుంటే.. పరిస్థితి అందుకు భిన్నంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నియంతృత్వ పాలనపై వనపర్తి వేదికగా పోరాటానికి శ్రీకారం చుడతామని.. ప్రజాక్షేత్రంలో యుద్ధం చేసేందుకు కుటుంబ అనుమతితో ఈ నిర్ణయానికి వచ్చామని స్పష్టం చేశారు.

అభివృద్ధికి ప్రతిబంధకం..

జెడ్పీలో అధికారపార్టీకి పూర్తి మెజార్టీ ఉన్నా.. రాజకీయ లబ్ధి కోసం సమావేశానికి హాజరుకాకపోవడం సరికాదని శ్రీరంగాపురం కాంగ్రెస్‌పార్టీ జెడ్పీటీసీ సభ్యుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. అభివృద్ధికి ప్రతిబంధకంగా మారటం ప్రజాపాలనను ఖూనీ చేయడమేనని తెలిపారు.

చీకటి రోజు..

ఉద్దేశపూర్వకంగా సమావేశానికి సభ్యులు రాకుండా చేయటం చీకటి రోజుగా భావించాల్సి వస్తోందని పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి అన్నారు. పాలన విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలకు మేలు చేయటమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నామని.. ఎవరి ప్రలోభాలకు తలొగ్గేది లేదన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం ఉన్నామని తెలిపారు.

కోరం లేక నేటికి వాయిదా

సుమారు రూ.10 కోట్ల పనులతీర్మానాలకు బ్రేక్‌

Read latest Wanaparthy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top