
మాట్లాడుతున్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి: మహారాష్ట్రలోని బారామతిలో రైతులు సంఘంగా ఏర్పడి రూ. కోట్ల విలువగల వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారని.. నియోజకవర్గ రైతులు ఆ స్థాయికి ఎదిగేలా కృషి చేస్తానని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాజపేట శివారులోని బీఆర్‌ఎస్ భవన్ వద్ద నిర్వహించిన మండలస్థాయి ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు తాము పండించిన పంటను వారే ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేసుకునేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. మహారాష్ట్రాలోని 45కు పైగా నియోజకవర్గాల్లో రైతు సంఘాలున్నాయని.. కనీస విద్యార్హతతోనే రూ.కోట్ల విలువగల ఫ్యాక్టరీలను విజయవంతంగా నడిపిస్తున్నారని వివరించారు. ఈ వ్యవస్థను దూరదృష్టితో ఏర్పాటు చేయించిన శరత్‌పవార్‌ను ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో యువతకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు లభించేలా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా మంత్రి మాట్లాడుతుండగానే పలువురు భోజనాలకు వెళ్తుండగా.. మైక్ బంద్ అయ్యే వరకు భోజనాలు ఉండవంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. జిల్లాకేంద్రంలోని నాలుగో వార్డుకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌లో చేరగా మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఫ సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను ఆదివారం జిల్లాకేంద్రంలో మంత్రి ప్రారంభించారు. శిక్షకుడు శ్యాంసుందర్‌ను శాలువాతో సన్మానించారు.
ఫ హైదరాబాద్ ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో విలువలతో కూడిన విద్యపై నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనవర్చిన విద్యార్థులకు ఆదివారం జిల్లాకేంద్రంలో మంత్రి ప్రశంసాపత్రాలు అందజేశారు. క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టుయాదవ్, నాయకులు పురుషొత్తంరెడ్డి, మాణిక్యం, నర్సింహ, రఘు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి క్రైం: జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎరుకల కులస్తుల భవన నిర్మాణానికి కేటాయించిన 8 గుంటల స్థలానికి సంబంధించిన ప్రొసీడింగ్‌ను మంత్రి నిరంజన్‌రెడ్డి కులస్తులకు అందజేశారు. భవన నిర్మాణానికిగాను త్వరలో రూ.10 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షుడు సిల్‌మార్తి బాలస్వామి, ఆంజనేయులు, తిరుపతయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.
మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి