రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

Sep 16 2026 3:13 AM | Updated on Sep 16 2026 3:13 AM

విజయనగరం గంటస్తంభం: ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, అర్హులకు ఇల్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతు మాధవన్‌తో కలిసి కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో మంగళవారం సమీక్షించారు. మార్చి 2027 నాటికి రీ–సర్వే లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని, అక్టోబర్‌ 2026 నాటికి పాసుపుస్తకాల పంపిణీని వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, హౌసింగ్‌ పీడీ మురళి, సర్వే ఏడీ విజయకుమార్‌, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

డీఎస్సీ అక్రమాలపై

సీబీఐ విచారణకు డిమాండ్‌

అర్హులైన నిరుద్యోగులకు న్యాయం చేయాలి

విజయనగరం గంటస్తంభం: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.సుమన్‌ డిమాండ్‌ చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటించకపోవడం, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోవడం వల్ల అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్లక్ష్యం చేస్తే విద్యార్థులు, నిరుద్యోగులను సమీకరించి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

నవంబర్‌ 15న

ఎన్‌ఎంఎంఎస్‌ఎస్‌ రాతపరీక్ష

పార్వతీపురం రూరల్‌: జాతీయ ప్రతిభ ఆధారిత పేదరిక నిర్మూలన ఉపకార వేతన పథకం (ఎన్‌ఎంఎంఎస్‌ఎస్‌) రాతపరీక్ష ఈ ఏడాది నవంబర్‌ 15న జరగనుందని డీఈఓ పి.బ్రహ్మాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, ఏపీ మోడల్‌, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఏడో తరగతిలో 55 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50 శాతం) సాధించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల లోపు ఉండి, తహసీల్దార్‌ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుము కింద ఓసీ, బీసీలు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.50 చొప్పున ఎస్‌బీఐలో చెల్లించాలి. పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. ఆసక్తిగల విద్యార్థుల దరఖాస్తు చేసేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని కోరారు.

నిలకడగా

తోటపల్లి నీటి ప్రవాహం

గరుగుబిల్లి: అల్పపీడన ప్రభావంతో ఒడిశాలో కురుస్తున్న వర్షాల నాగావళి నదిలో తోటపల్లి ప్రాజెక్టువద్ద నీటి ప్రవాహం నిలకడగా ఉంది. మంగళవారం సాయంత్రం నాటికి 105 మీటర్లకు 104.15 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో 3,570ల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, రెండు గేట్లను ఎత్తేసి 4,706 క్యూసెక్కుల నీటిని తిరిగి నదిలోకి విడిచిపెడుతున్నారు. కుడి ప్రధాన కాలువకు 800, పాతకుడి కాలువకు 40, ఎడమ కాలువకు 414 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్టు ప్రాజెక్టు ఏఈ కిశోర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement