● పురుగు మందు డబ్బాలతో
తహసీల్దార్ కార్యాలయం ముందు
ఎస్సీ రైతుల ధర్నా
రామభద్రపురం: కాళ్లరిగేలా తిరుగుతున్నా తమ భూ సమస్యను పరిష్కరించడంలేదని, ఇక చావే శరణ్యమంటూ రామభద్రపురం మండలం ఇట్లామామిడిపల్లి ఎస్సీ రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. పురుగు మందు డబ్బాలు పట్టుకుని తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం ఆందోళన చేశారు. ఇట్లామామిడిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 161లో ఎస్సీలకు చెందిన సుమారు 3 ఎకరాల భూమిని విజయనగరానికి చెందిన ఓ పెత్తందారు కబ్జాచేసి కంచె ఏర్పాటు చేశాడని, సమస్య పరిష్కరించి న్యాయంచేయా లని అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందించకపోవడంపై ఆందోళన వ్యక్తంచేశారు. సమస్య పరిష్కరించకుంటే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీనిపై తహసీల్దార్ స్పందిస్తూ బుధవారం క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. రైతుల నుంచి పురుగు మందు డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో రైతులు అక్యారపు లక్ష్మణ, రామవరపు సత్యం, బలగ లక్ష్మణరావు, సత్యం పైడమ్మ, రాములమ్మ, సీపీఎం నాయకుడు బలస శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
వీరఘట్టంలో కుండపోత
వీరఘట్టం: వీరఘట్టంలో మంగళవారం ఉదయం వేసవిని తలిపించే ఎండతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఉక్కపోత, ఎండ తీవ్రతతో అల్లాడిపోయారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం 6 గంటల వరకు ఏకదాటిగా కుండపోతగా వర్షం కురిసింది. 4.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ రాజేశ్వరరావు తెలిపారు. వర్షం రైతుల్లో హర్షాన్ని నింపింది.


