హుండీల ఆదాయం లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

హుండీల ఆదాయం లెక్కింపు

Mar 26 2026 7:18 AM | Updated on Mar 26 2026 7:18 AM

విజయనగరం టౌన్‌: పైడితల్లి అమ్మవారి దత్తాలయాలైన శివాలయం వీధిలో ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వరస్వామి ఆలయ హుండీల ద్వారా 97 రోజులుకుగానూ లక్షా రూ. 69వేల 563 నగదు లభించిందని ఆలయ ఈఓ కె.శిరీషా బుధవారం తెలిపారు. అదే విధంగా మూడు కోవెళ్లుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వీరరాజేశ్వరస్వామి దేవాలయ హుండీలకు సంబంధించి 11 నెలలకుగానూ రూ. 76 వేల 553ల నగదు లభించిందన్నారు.

భార్యను హత్య చేసిన భర్తకు జీవితఖైదు

విజయనగరం క్రైమ్‌ : అనుమానంతో భార్యను హత్య చేసిన భర్తకు విజయనగరం 5వ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి ఎన్‌.పద్మావతి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించినట్టు ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ బుధవారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని పెదమానాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చుక్కపేటకు చెందిన యాకల సత్యనారాయణ అలియాస్‌ సత్యం తన భార్య గౌరమ్మకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తరచూ గొడవలు పడేవారు. ఆ అనుమానంతోనే 2025 ఫిబ్రవరి ఆరో తేదీన ఓ పామాయిల్‌ తోట వద్ద గౌరమ్మను హత్య చేశాడు. ఈ విషయమై మృతురాలి కుమారుడు వై.గణేష్‌ ఫిర్యాదు మేరకు పెదమానాపురం ఎస్‌ఐ ఆర్‌.జయంతి కేసు నమోదు చేశారు. గజపతినగరం సీఐ జీఏవీ రమణ దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు విచారణలో నిందితుడు యాకల సత్యనారాయణపై నేరారోపణలు రుజువు కావడంతో జడ్జి పై విధంగా తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ తెలిపారు. పోలీసు వారి తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వై.రేవతి వాదనలు వినిపించారు.

శ్రీశైల క్షేత్రంలో తమ్మిన సిస్టర్స్‌ సంగీత కచేరీ

విజయనగరం టౌన్‌: శ్రీశైల క్షేత్రంలో విజయనగరానికి చెందిన సప్తస్వరాలయ విద్యార్థులు తమ్మిన సిస్టర్స్‌ శాసీ్త్రయ సంగీత కచేరీ, భరతనాట్య ప్రదర్శన బుధవారం రాత్రి నిర్వహించారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా శ్రీశైల దేవస్ధానం నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శన ఆద్యంతం ఆహుతుల మన్ననలు పొందింది. అనంతరం ఆలయ నిర్వహకులు వారిని ఘనంగా సత్కరించారు.

విద్యుదాఘాతంతో గృహిణి మృతి

పార్వతీపురం రూరల్‌: వర్షపు నీటిని బయటకు పంపేందుకు చేసిన ప్రయత్నం ఓ గృహిణి ప్రాణం తీసింది. బుధవారం సాయంత్రం పార్వతీపురంలో కురిసిన భారీ వర్షానికి రామాపురం కాలనీకి చెందిన ముక్కు పార్వతి (55) ఇంటి మొదటి అంతస్తుపై నీరు నిలిచిపోయిందని, డ్రైనేజీ పైపులో అడ్డంకిని తొలగించేందుకు ఇనుప గజంతో ప్రయత్నించింది. ఈ క్రమంలో ఇంటి ముందు ఉన్న ఎల్టీ విద్యుత్‌ తీగలకు గజం తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురైన ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పార్వతి మృతి చెందింది.

ఎన్నికల రోల్స్‌, మ్యాపింగ్‌, ఫారంలు పక్కా పరిశీలన

పార్వతీపురం: ఎన్నికల రోల్స్‌, మ్యాపింగ్‌, ఫారాలు పక్కాగా పరిశీలిస్తున్నట్టు జిల్లా రెవెన్యూ అధికారిణి కె.హేమలత పేర్కొన్నారు. ఆమె తన చాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సమర్దవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలతో సమన్వయం అత్యంత కీలకమన్నారు. జిల్లాలో 68 శాతం మ్యాపింగ్‌ పూర్తి చేసి రాష్ట్రంలో మూడవ స్థానంలో ఉన్నామన్నారు. ఇంతవరకు 4 వేల మంది ఓటర్లను నమోదు చేయడం జరిగిందన్నారు. ఓటు ఉన్న ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా స్థానికతను నిర్ధారిస్తూ డిక్లరేషన్‌ ఇవ్వాలన్నారు. ఎన్నికల రోల్స్‌ సవరణ ప్రక్రియలో లోపాలున్నట్లు గుర్తిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయుకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement