ప్రభుత్వ బడిలో ఏఐ పాఠాలు
చీపురుపల్లి: చదువు మాత్రమే పేదరికాన్ని దూరం చేస్తుందని, విద్యార్థులు ప్రయోజకులైతే ఆ కుటుంబాలు బాగుపడతాయని నమ్ముతూ ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన విద్యను అందించేందుకు నాటి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కృషిచేసింది. నాడు–నేడుతో ప్రభుత్వ బడులకు ఆధునిక హంగులు కల్పించడంతో పాటు ట్యాబ్‌లు, బైజూస్ కంటెంట్‌తో పాఠ్యాంశాలను బోధించేలా విద్యాసంస్కరణలు చేపట్టింది. అక్కడితో ఆగకుండా ప్రస్తుత రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్సీ(ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎనిమిదో తరగతి నుంచి ఏఐను పరిచయం చేయడంతోపాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోలిగే సామర్థ్యాలు అందించాలని భావించారు. ఇంటెల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని 2024 మార్చి 2న చీపురుపల్లిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు కింద ఏఐ ల్యాబ్‌ను ప్రారంభించారు. తరువాత కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ప్రతిపాదన మూలకు చేరిన విషయం తెలిసిందే.
ఆలిండియా ఏఐ ఇంపాక్ట్ ఫెస్టివల్‌లో చీపురుపల్లి
విద్యార్థులు
2025 నవంబర్ నెలలో ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో కేంద్ర విద్యాశాఖ, ఇంటెల్ సంస్థ సంయుక్తంగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్సీ ఇంపాక్ట్ ఫెస్టివల్ నిర్వహించాయి. ఈ ఫెస్టివల్‌లో చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఏఐ ల్యాబ్‌లో శిక్షణ తీసుకున్న ఆర్.హర్షిత (9వ తరగతి), పీవిఎల్.ప్రణవి, పి.తనిష్క్‌లు సిద్ధం చేసిన సిటిజన్ క్రెడిట్ కార్డు, ఏఐ ఆధారిత క్యూ మేనేజ్‌మెంట్ అనే రెండు ప్రాజెక్టులు ప్రదర్శించారు. వీటిని పరిశీలించిన ఇంటెల్ అంతర్జాతీయ వ్యవరాల ప్రతినిధి సారా కెంప్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. భారత ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్ కార్యదర్శి ఎస్.కృష్ణన్ చీపురుపల్లి పాఠశాలను పేరును ప్రస్తావిస్తూ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
50 ప్రాజెక్టులకు రూపకల్పన
చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో ఏఐ ల్యాబ్ ఏర్పాటైనప్పటి నుంచి అక్కడ ఫెసిలిటేటర్ బాధ్యతలను అదే పాఠశాలలోని హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఏవీఆర్‌డీ ప్రసాద్‌కు అప్పగించారు. ఆయన శిక్షణలో ఏడాదిన్నర కాలంలో విద్యార్థులు 50 ప్రాజెక్టులు వరకు రూపొందించారు. ఏఐ ఫర్ ఫ్యూచర్ అనే యూట్యూబ్ ఛానల్‌ను కూడా తయారుచేసి అందులో వీరు తయారు చేసిన ప్రాజెక్టులను అప్‌లోడ్ చేస్తున్నారు. అందులో ప్రధానంగా బ్‌లైండ్ పీపుల్ అసిస్టెన్స్ డివైజ్ (బీఏడీ) యాప్‌ను తయారు చేశారు. ఇటీవల ఇదే పాఠశాలకు చెందిన ఆర్.హర్షిత, పీవీఎల్ ప్రణవి పారిశుద్ధ్యంపై ఎన్‌పవరింగ్ అవర్ శానిటేషన్ హీరోస్ పేరుతో సిటిజన్ క్రెడిట్ కార్డు అనే ప్రాజెక్టును రూపొందించారు. ఎంతో విలువైన సేవలందించే పారిశుద్ధ్యకార్మికులతో పాటు సమాజానికి ఉపయోగపడే ప్రతీ ఒక్కరికీ సిటిజన్ క్రెడిట్ కార్డు ద్వారా పాయింట్లు కేటాయించి వారికి విద్యుత్ బిల్లు, ఇంటి పన్ను వంటి అంశాల్లో రాయితీలు ఇవ్వడం ఈ సిటిజన్ క్రెడిట్ కార్డు ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.
నాటి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ముందుచూపు
చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో ఏఐ ల్యాబ్ ఏర్పాటు
ఇంతవరకు 50 ఏఐ ప్రాజెక్టులు తయారు చేసిన విద్యార్థులు
ఢిల్లీ స్థాయిలో ప్రదర్శనలు
ప్రభుత్వ బడిలో ఏఐ పాఠాలు
ప్రభుత్వ బడిలో ఏఐ పాఠాలు


