గ్రంథాలయాలకు చంద్ర గ్రహణం
మెరకముడిదాం: విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఉపయోగపడే గ్రంథాలయాలు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారుతున్నాయనే చెప్పుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రంథాలయాలకు అవసరమయ్యే కొత్త పుస్తకాలు కొనుగోలు చేయకపోవడంతో పాత సమాచారంతో ఉన్న పుస్తకాలు పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉపయోగపడడంలేదు. ఫలితంగా నిరుద్యోగులు గ్రంథాలయాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి సిబ్బంది కొరత కూడా తోడు కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తున్న గ్రంథాలయాలు మూతపడే పరిస్థితి నెలకొంది.
ఆధునిక దేవాలయాలుగా పేరుబడిన గ్రంథాలయాలు మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు చెందకపోవడంతో అటు పాఠకులు, ఇటు నిరుద్యోగుల ఆదరణ కరువై నిర్వీర్యమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం గ్రంథాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం, కొత్త పుస్తకాలు కొనుగోలుకు అనుమతులు లేకపోవడంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు చేసేది లేక ఇతర మార్గాలను వెతుక్కుంటున్నారు. మరికొందరు విద్యార్థులు ఏఐ టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మొత్తం 41 గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో గ్రేడ్ – 1 గ్రంథాలయాలు – 1, గ్రేడ్ – 2 గ్రంథాలయాలు – 4, గ్రేడ్ – 3 గ్రంథాలయాలు–33, గ్రామీణ గ్రంథాలయాలు – 3 వున్నాయి. ఉమ్మడి విజయనగరంలో వున్న 41 గ్రంథాలయాల్లో 26 గ్రంథాలయాలకు సొంత భవనాలు వుండగా మిగిలిన వాటిలో 8 గ్రంథాలయాలు అద్దె భవనాల్లోనూ, 7 గ్రంథాలయాలను అద్దె లేని భవనాలలో అధికారులు నిర్వహిస్తున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో క్రీడలు, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు గణనీయంగా మారాయి. అన్ని రంగాల్లో కరెంట్ అఫైర్స్ మారిపోయాయి. వీటన్నింటితో కూడిన పుస్తకాలు టెట్, డీఎస్సీతో పాటూ బ్యాంకింగ్ రంగానికి చెందని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి గ్రంథాలయాల్లో అందుబాటులో లేవు. గ్రూప్ పరీక్షలకు హాజరయ్యే వారికి అవసరమైన ఎకనామీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ పుస్తకాలు అవసరం. నిరుద్యోగ అభ్యర్థులకు అప్డేట్ కరెంటు అఫైర్స్ అందుబాటులో లేకపోవడంతో గ్రంథాలయాలకు వచ్చిన అభ్యర్థులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
కొత్త పుస్తకాలు కొనుగోలులో
చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం
గ్రంథాలయాలను వేధిస్తున్న పుస్తకాలు, సిబ్బంది కొరత
అందుబాటులో లేని కాంపిటేటివ్
పుస్తకాలు
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 41
గ్రంథాలయాలు
11 లైబ్రేరియన్ల పోస్టులు ఖాళీ
సిబ్బంది కొరతతో మూతపడుతున్న కొన్ని గ్రంథాలయాలు
వేధిస్తున్న ఉద్యోగుల కొరత
ఇదిలా వుంటే మరోవైపు ఈ గ్రంథాలయాలను ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. జిల్లా వ్యాప్తంగా 11 లైబ్రేరియన్ పోస్టులు, 2 రికార్డు అసిస్టెంట్ పోస్టులు, 14 ఆఫీసు సబార్డినేట్ పోస్టులు ఖాళీగా వున్నాయని అధికారులు చెబుతున్నారు. గ్రంథాలయాధికారులు 11, రికార్డు అసిస్టెంట్లు రెండు, ఆఫీస్ సబార్డినేట్లు 14 ఖాళీలున్నాయి. జిల్లాలో వున్న 41 గ్రంథాలయాల పరిధిలో 33,640 మంది సభ్యులు ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. లైబ్రేరియన్ల కొరత కారణంగా కొన్ని లైబ్రేరీలకు ఇన్‌చార్జ్‌లే దిక్కుగా మారింది. అదే విధంగా మరోవైపు ఇన్‌చార్జ్ బాధ్యతలను నిర్వహిస్తున్న లైబ్రేరియన్‌లకు అదనపు పని భారంతో పాటూ ఆర్థిక భారం కూడా తోడవుతుందంటున్నారు. అదనంగా చేస్తున్న పనికి ప్రభుత్వం అదనంగా జీతం ఇవ్వడం లేదు సరికదా కనీసం టీఏ, డీఏలైనా ఇవ్వకపోతే తమ వేతనాల్లో నుంచి ఎన్నాళ్లు ఖర్చు చేయగలగమని వాపోతున్నారు.


