క్రమ‘శిక్షణ’తో పూర్తిచేయండి
విజయనగరం క్రైమ్: కానిస్టేబుల్ ఉద్యోగం మిగిలిన శాఖల కన్నా భిన్నమైనది.. విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది.. మారుతున్న నేరాలకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి.. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పోలీస్ అభ్యర్థులకు ఎస్పీ దామోదర్ దిశానిర్దేశం చేశారు. జిల్లా నుంచి ఎంపికై న 116 మంది అభ్యర్థుల్లో 38 మంది మహిళలను ఒంగోలు పీటీసీకి, 78 మంది పురుషులను చిత్తూరు పీటీసీకి శిక్షణకు వేశారు. ఈ సందర్భంగా వారితో పోలీస్ బ్యారెక్స్‌లో శనివారం ఎస్పీ మమేకమయ్యారు. శిక్షణలో నేర్చుకోవాల్సిన అంశాలను వివరించారు. శిక్షణలో ప్రతిభ చూపి జిల్లాకు పేరుతీసుకురావాలని సూచించారు. రాబోయే రోజుల్లో సైబర్ నేరాలు, మోసాలు సవాల్‌గా మారుతాయని, వాటిని ఛేదించే నైపుణ్యాలు మన సొంతం కావాలన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగమేనన్న నిరాశ వద్దని, మంచి క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వహిస్తే ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీ స్థాయికి ఎదగవచ్చన్నారు. శిక్షణ సమయంలో వివిధ చట్టాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. 9 నెలల శిక్షణ పూర్తయ్యేనాటికి ప్రతి ఒక్కరూ మెరికల్లా తయారుకావాలన్నారు. సమాజానికి పట్టిన జబ్బును వదిలించే డాక్టర్‌లా పోలీసులు పనిచేయాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనవు ఎస్పీ పి.సౌమ్యలత, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, సీసీఎస్ సీఐ ఎస్.కాంతారావు, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు ఎన్.గోపాలనాయుడు, టి.శ్రీనివాసరావు, ఆర్‌ఎస్‌ఐ నీలిమ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ అభ్యర్థులకు ఎస్పీ దిశానిర్దేశం
వృత్తి నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి
జిల్లాకు పేరు తేవాలి
ఒంగోలు, చిత్తూరు పీటీసీల్లో జిల్లా అభ్యర్థులకు శిక్షణ


