దీర్ఘకాలిక రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి : కలెక్టర
విజయనగరం అర్బన్: జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో శనివారం నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యాన్ని స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన ప్రతిపాదనలు, సాధ్యమైన పరిష్కార మార్గాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా జిల్లాలో ఉన్న ప్రధాన రెవెన్యూ పరమైన సమస్యలపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. సమావేశంలో రీసర్వే ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు. సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్, డీఆర్‌వో మురళి, ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.
సవరవిల్లి–తూడెం–భోగాపురం రోడ్డు పనులు వేగవంతం చేయాలి
సవరవిల్లి, తూడెం, భోగాపురం రోడ్డు కనెక్టివిటీకి సంబంధించిన ఏడీఏసీఎల్ ప్రతిపాదించిన రహదారి పనులపై కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి శనివారం తన చాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిపాదిత రహదారిలో మామూలు కల్వర్టు స్థానంలో బాక్స్ కల్వర్టు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారి నిర్మాణ పనులను ఆరు నెలలలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో కలెక్టరేట్ నుంచి పీఆర్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసరావు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏడీఏసీఎల్ జీఎం ప్రవీణ్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కాంతిమతి, సంబంధిత కాంట్రాక్టర్‌్ పాల్గొన్నారు.


