అంబేడ్కర్ మార్గంలో నడుద్దాం..
విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం పురస్కరించుకుని అంబేడ్కర్ రైట్స్ ఫోరమ్ ఆంధ్రప్రదేశ్ శాఖ రూపొందించిన కరపత్రాలను జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీసీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ధర్మపురిలో గల సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్‌లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందన్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ రాజ్యాంగంలో విద్య, వైద్యం ప్రభుత్వం అమలు చేయాలని ప్రాథమిక హక్కులలో భాగంగా ఉంటే చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయటం లేదని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు జీవో నెంబర్ 590 ద్వారా మెడికల్ కాలేజ్‌లను అప్పగించి పేద వర్గాలకు వైద్య విద్యను, వైద్యాన్ని దూరం చేయడం దారుణమన్నారు. 2019 – 2024 మధ్య కాలంలో సంక్షేమ పథకాల ద్వారా రూ.రెండు లక్షల కోట్లు ఆర్థిక సాయం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ఘనత జగన్‌మోహన్ రెడ్డికే చెందుతుందని పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో 127 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని రూ.404 కోట్లు ఖర్చు పెట్టి 19 ఎకరాల్లో చేపట్టిన సృతి వనాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో వేపాడ మండల పార్టీ అధ్యక్షులు జగ్గు బాబు, అంబేడ్కర్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భానుమూర్తి, కార్పొరేటర్ బోనేల ధనలక్ష్మి, బుధరాయవలస మఽధు తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు


