రైతన్నకు అండగా అగ్రిల్యాబ్‌లు
● గత ప్రభుత్వ హయాంలో విజయనగరం జిల్లాలో 8 అగ్రిల్యాబ్‌ల ఏర్పాటు
బొబ్బిలి: గతంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం జిల్లాలో ఏర్పాటుచేసిన అగ్రిల్యాబ్‌లు రైతన్నకు అండగా నిలుస్తున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నాణ్యతను పరీక్షించేందుకు సహకరిస్తున్నాయి. మట్టి పరీక్షలు చేసి భూసార నివేదికలు అందిస్తున్నాయి. ఏ నేలలో ఏ పంట సాగుచేస్తే లాభదాయకమో తెలియజేస్తున్నాయి. గతంలో స్థానికంగా అగ్రిలాబ్‌లు లేకపోవడంతో రైతులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో రైతులు నష్టపోయేవారు. దీనికి చెక్ చెబుతూ జిల్లాలోని నాలుగున్నర లక్షల మంది రైతులకు మేలుచేకూర్చేలా ఉమ్మడి విజయనగరం జిల్లాలో 8 చోట్ల అగ్రిల్యాబ్‌లను గత ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఒక్కోల్యాబ్‌కు రూ.55 లక్షలు వెచ్చించింది. జిల్లా కేంద్రంలో రూ.3.68 కోట్ల ఖర్చుతో జిల్లాస్థాయి ల్యాబ్‌ను నిర్మించింది. డాక్టర్ వైఎస్సార్ సమీకృత వ్యవసాయ ప్రయోగ శాలలుగా పిలిచే ఈ అగ్రిల్యాబ్‌లలో ముగ్గురు సిబ్బందిని నియమించింది. వీరి ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి రీజనల్ కోడింగ్ సెంటర్‌తో పాటు చైన్నె, బెంగుళూరు, ఫరీదాబాద్ ప్రాంతాల్లో నిర్వహించే పరీక్షల ఫలితాలను కోడింగ్ ద్వారా ఎంపికచేసి నాణ్యమయినవి, కానివి వీరు గుర్తించి రైతులకు ఆర్‌బీకేల ద్వారా సమాచారం అందించేవారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ల్యాబ్‌ల సేవలను అందకుండా చేస్తోందంటూ రైతులు వాపోతున్నారు.


