డీపీటీసీని తనిఖీచేసిన విశాఖ రేంజ్ డీఐజీ
విజయనగరం క్రైమ్: విజయనగర శివారు సారిపల్లి వద్ద ఉన్న జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని (డీపీటీసీ) విశాఖ పోలీస్ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మంగళవారం పరిశీలించారు. విజయనగరం 5వ బెటాలియన్‌లో ట్రైనీకానిస్టేబుళ్లకు క్రమశిక్షణతో కూడిన శిక్షణ అందించేందుకు కావాల్సిన మౌలిక వసతుల పై ఆరా తీశారు. శిక్షణార్థులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. శిక్షణ కేంద్రంలోని తరగతి గదులు, కార్యాలయం, వంటగది, డైనింగ్‌హాల్, స్టోర్ రూమ్, వాష్‌రూమ్, స్నానపు గదులు, మినరల్ వాటర్ ప్లాంట్, పరేడ్ గ్రౌండ్, కంప్యూటర్ ల్యాబ్, ఫైరింగ్ రేంజ్‌లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఏఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీలు ఆర్.గోవిందరావు, ఎం.వీరకుమార్, ఎస్‌బీ సీఐ లీలారావు, ఆర్‌ఐ ఎన్.గోపాలనాయుడు ఉన్నారు.


