వచ్చేనెల 8 నుంచి పండగ సర్వీసులు
విజయనగరం అర్బన్: సంక్రాంతి పండగ కోసం జిల్లాలోని స్వగ్రామాలకు రాకపోకలు జరిపే ప్రయాణికుల కోసం వచ్చేనెల 8వ తేదీ నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతామని జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. జిల్లాలోని విజయనగరం, ఎస్.కోట డిపోల పరిధిలోని బస్సులను విజయవాడ, భీమవరం, రాజోలు, విశాఖపట్నంకి ప్రత్యేక సర్వీసులుగా నడుపుతామని పేర్కొన్నారు. ఈ సర్వీనులలో సాధారణ చార్జీలు మాత్రమే వసూలుచేస్తామన్నారు. తిరుగు ప్రయాణం చేసేవారికోసం వచ్చేనెల 16 నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు. ముందుగా రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం కల్పించామని వివరించారు. ప్రయాణికులు ‘ఏపీఎస్‌ఆర్‌టీసీఆన్‌లైన్.ఐఎన్’ వెబ్‌సైట్‌లో, లేదంటే దగ్గరలో ఉన్న బస్ స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద టికెట్లు బుక్‌చేసుకోవాలని సూచించారు.
20 నుంచి డోర్ డెలివరీ మాసోత్సవాలు
ఆర్టీసీ కార్గో సేవల్లో డోర్ డెలివరీ మాసోత్సవాలను ఈ నెల 20 నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు నిర్వహిస్తామని జిల్లా ప్రజారవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. అతి తక్కువ చార్జీలతో పార్సిల్, కొరియర్ సర్వీసులను గమ్యస్థానాలకు చేర్చుతామన్నారు. 10 కిలోమీటర్ల పరిధిలో 50 కేజీల వరకు డోర్ డెలివరీ చేస్తామన్నారు.


