జగనన్న సీఎం కావాలని...
రేగిడి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ శబరిమలలో అయ్య ప్పకు రేగిడి మండలం లచ్చన్నవలస గ్రామానికి చెందిన అయ్యప్పదీక్ష ధారులు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. గ్రామానికి చెందిన 20 మంది భక్తులు 41 రోజుల కిందట అయ్యప్పదీక్ష ప్రారంభించారు. దీక్ష ముగియడంతో శబరిమల యాత్రకు వెళ్లిన వీరంతా అక్కడ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ ఆలయానికి చేరుకున్నారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అయ్యప్పను ప్రార్థించారు.
రేపటి నుంచి చెరకు క్రషింగ్
రేగిడి: మండలంలోని సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారంలో ఈ నెల 5 నుంచి చెరకు క్రషింగ్ ప్రారంభించనున్నట్టు యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2025–26 సీజన్‌లో మెట్రిక్ టన్ను చెరకు రూ. 3,360లు మద్దతు ధరగా ప్రకటించామని వెల్లడించింది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది టన్నుకు రూ.209లు మద్దతు ధర పెంచినట్టు పేర్కొంది. రైతులకు కటింగ్ ఆర్డర్లు ఇస్తున్నామని తెలిపింది. చెరకు నరికేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చామని వెల్లడించింది.
చిన్నారుల మరణాలపై
చలించరా మంత్రివర్యా!
సాక్షి, పార్వతీపురం మన్యం: ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా గడిచిన ఏడాదిన్నర కాలంలోనే జిల్లాలో 16 మంది ఆశ్రమ, ఇతర పాఠశాలల విద్యార్థులు వివిధ అనారోగ్య సమస్యలతో మరణించారు. కొద్దిరోజుల కిందట కురుపాం బాలిక గురుకుల పాఠశాలలో పచ్చకామెర్ల ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. తోయక కల్పన, అంజలి అనే ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు. 200 మందికిపైగా వ్యాధి బారిన పడ్డారు. పాఠశాలలో కలుషిత నీరు, అధ్వాన పారిశుద్ధ్యం, కనీస సౌకర్యాల లేమి ఈ దుస్థితికి కారణమని విద్యార్థి, గిరిజన సంఘాలు గగ్గోలు పెట్టాయి. ఈ ఘటనపై స్పందించిన వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. మావనతాదృక్పథంతో స్పందించిన ఆయన.. మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఆ మొత్తాన్ని వెనువెంటనే బాధిత కుటుంబాలకు కురుపాంలో పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, పాముల పుష్పశ్రీవాణి, పీడిక రాజన్నదొర తదితరుల చేతుల మీదుగా అందజేశారు. ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటికీ ఎటువంటి భరోసా కూడా లభించలేదు. ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీతో పాటు, గిరిజన, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నా.. ఫలిత లేకపోతోంది. ఈ ఘటనను వైఎస్సార్‌సీపీ జాతీయస్థాయికి తీసుకెళ్లి, పోరాటం చేసింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎస్టీ కమిషన్‌లకూ ఫిర్యాదు చేసింది. జిల్లాలో మూడు రోజులపాటు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రతినిధి బృందం విచారణ సైతం చేపట్టింది. అనారోగ్యంతోనే గత అక్టోబర్ 24న సీతంపేటలోని హడ్డుబంగి ఆశ్రమ పాఠశాలలో మండంగి కవిత అనే ఆరో తరగతి విద్యార్థిని మృతి చెందింది. నష్టపరిహారం అందించాలని చిన్నారి కుటుంబ సభ్యులు, గిరిజన సంఘ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా.. జిల్లాకే చెందిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కనీస స్పందన చూపలేకపోయారు. వారికి పరిహారాన్ని ప్రభుత్వం నుంచి తెప్పించడంలో సఫలీకృతం కాలేకపోయారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఆయన నుంచైనా పరిహారం ప్రకటన వస్తుందని మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఆ మేరకు మంత్రి లోకేశ్ ప్రకటన చేయాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.
జగనన్న సీఎం కావాలని...


