వారంతా భారం కాదు.. మనలో ఓ భాగం
● జిల్లా న్యాయసేవాధికార సంస్థ
కార్యదర్శి కృష్ణప్రసాద్
విజయనగరం అర్బన్: దివ్యాంగులు సమాజానికి భారం కాదని.. వారూ సమాజంలో అంతర్భాగమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎ.కృష్ణప్రసాద్ అన్నారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగం ఆనంద గజపతి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలు, హక్కులు, అవకాశాల గురించి సమాజంలో అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. శారీరక, మానసిక పరిమితులున్నప్పటికీ వారి ప్రతిభ, పట్టుదల, నిబద్దత అసాధారణమైందని.. సమాన అవకాశాలు ఇస్తే వారు సాధించే విజయాలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను వివరించారు. అయితే, విరిగిన కుర్చీల మధ్యన కూర్చొనేందుకు విభిన్నప్రతిభావంతులు ఇబ్బందులు పడ్డారు. కార్యక్రమంలో మెప్మా పీడీ జి.వి.చిట్టిరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ విభిన్న ప్రతిభావంతుల శాఖ ఇన్‌చార్జి ఎ.డి. డి.వెంకటేశ్వరరావు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కేఆర్‌ఎస్ ప్రసాద్, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ సూర్యారావు, బదిరుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్.భారతి, తదితరులు పాల్గొన్నారు.
వారంతా భారం కాదు.. మనలో ఓ భాగం


